Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ అధ్యక్ష పోస్టుకు రాహుల్ గాంధీ ‘నో’.. ప్రియాంక గాంధీకి బాధ్యతలు?

కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించడానికి రాహుల్ గాంధీ ఇప్పటికీ సంసిద్ధత తెలుపలేదని ఆ పార్టీ నేతలు తెలిపారు. కానీ, తాము ఆయన అంగీకారానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాగా, మరికొందరు ప్రియాంక గాంధీ వైపు చూపు సారిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు పార్టీలో ఎన్నికలు జరుగుతాయని ఇటీవలే పార్టీ వర్గాలు తెలిపిన సంగతి తెలిసిందే.

rahul gandhi says no to lead congress, leaders turns to priyanka gandhi
Author
First Published Aug 20, 2022, 2:56 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో వ్యవస్థాగత స్థానాలకు ఎన్నికలు ఈ నెల 21వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు జరుగుతాయని ఇటీవలే కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరగనున్నాయి. కానీ, పార్టీ అధ్యక్ష పగ్గాలపై రాహుల్ గాంధీ మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోలేదని తెలిసింది. పార్టీ అధ్యక్షుడిగా చేయడానికి ఆసక్తి లేదని ఆయన సమాధానం ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు వివరించాయి. అలాగే, అనారోగ్య సమస్యల కారణంగా సోనియా గాంధీ మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలు లేవని తెలుస్తున్నది. ఈ తరుణంలో ప్రియాంక గాంధీ పేరు వినిపిస్తుండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి తదుపరి అధ్యక్ష పదవిని ప్రియాంక గాంధీ అధిరోహిస్తారా? అనే చర్చ జరుగుతున్నది.

2019లో అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ మళ్లీ అటు వైపుగా చూడలేదు. పార్టీ నాయకులు పలుమార్లు ఆయనను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నా.. ఒత్తిడి చేస్తున్నా ఆయన మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదు. పార్టీ అధ్యక్ష ఎన్నికలు సమీపించిన తరుణంలో మరోసారి పార్టీ నేతలు రాహుల్ గాంధీని కలిశారు. పార్టీ అధ్యక్ష పగ్గాలు పట్టాలని రాహుల్ గాంధీని కోరారు. ఆ విజ్ఞప్తులను రాహుల్ గాంధీ స్వీకరించలేదని తెలిసింది. 

ఔను.. రాహుల్ గాంధీ తనకు ఇష్టం లేదని చెప్పాడని కాంగ్రెస్ సీనియర్ నేత భక్త చరణ్ దాస్ తెలిపారు. కానీ, తాము తమ ప్రయత్నాలను విరమించుకోలేదని అన్నారు. అయితే, ఆ పోస్టును ఎవరితో నింపాలనేది కూడా రాహుల్ గాంధీ తమకు తెలియజేయాలని చెప్పినట్టు వివరించారు.

రాహుల్ గాంధీ తనకు ఆసక్తి లేదని చెప్పడంతో పలువురు నేతలు తమ చూపును ప్రియాంక గాంధీ వైపు సారించినట్టు తెలిసింది. గాంధీ కుటుంబ సభ్యులే పార్టీకి నేతృత్వం వహించాలని చాలా మంది కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కానీ, ప్రియాంక గాంధీ సారథ్యంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రియాంక గాంధీ వైపు చూస్తున్న వారిలో ఈ పరాజయం మెదులుతున్నది. అయితే, ఈ విషయంపైనా స్పష్టత లేదు.

రాహుల్ గాంధీ అధ్యక్షుడు కాకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై దాడులైనా.. కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాలు, ర్యాలీలకూ రాహుల్ గాంధే నేతృత్వం వహిస్తున్నారు. ఆయన కన్యాకుమారి నుంచి సెప్టెంబర్ నెలలో భారత్ జోడో యాత్రను ప్రారంభించనున్నారు.

తాము ఒక ర్యాలీ నిర్వహించబోతున్నామని, దానికి సారథ్యం రాహుల్ గాంధే వహిస్తారని హర్యానా మాజీ సీఎం భుపిందర్ సింగ్ హుడా తెలిపారు. అయితే, తనకు అధ్యక్ష ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయన్న నమ్మకం లేదని వివరించారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ఆ పార్టీ షెడ్యూల్ ఈ రోజు నుంచే ప్రారంభం అవుతున్నది. కానీ, ఎప్పటిలాగే ఆ విషయంపై అస్పష్టత కమ్ముకుని ఉన్నది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన చేయలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios