Asianet News TeluguAsianet News Telugu

 ప్రధాని మోదీ హయాంలో రెండు భారతదేశాలు ఆవిర్భవించాయి

భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి దాడి చేశారు. దేశవ్యాప్తంగా భయాందోళనలు, విద్వేషాలు రెచ్చగొట్టే పని బీజేపీ వాళ్లు చేశారని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ , నిరుద్యోగంపై బిజెపి ప్రభుత్వాన్ని నిందించారు.

Rahul Gandhi Says 2 Indias Exist Under PM Modi
Author
First Published Jan 6, 2023, 11:18 PM IST

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌తో సహా అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) విధానాలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి దాడి చేశారు. పథకం గురించి ప్రశ్నించినప్పుడల్లా బీజేపీ తనను 'యాంటీ ఆర్మీ' అని పిలుస్తుందని ఆయన అన్నారు. హర్యానాలోని పానిపట్‌లో జరిగిన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), పెద్ద నోట్ల రద్దు, అగ్నిపథ్‌పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో హర్యానా 'నిరుద్యోగ ఛాంపియన్'గా మారిందని, రాష్ట్రంలో యువశక్తి వృధా అవుతోందని, రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 38 శాతానికి చేరుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రయాణం మొత్తం దేశాన్ని కలుపుతోందని, కోట్లాది మంది ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నానని అన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రెండు భారతదేశాలు అవతరించాయనీ, ఒకటి రైతులు, కార్మికులు, నిరుద్యోగులు కూడింది. ఇందులో కోట్లాది మంది నివసిస్తున్నారు. మరొకటి సంపన్నులతో కూడిన భారత దేశం. ఇందులో  దేశంలోని సగభాగం సంపద 100 మంది ధనవంతుల వద్దే ఉందని అన్నారు.  భారతదేశంలో సగం మంది చేతుల్లో ఉన్నంత సంపద వంద మంది ధనవంతుల వద్ద ఉందని అన్నారు. పానిపట్ గతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల కేంద్రంగా ప్రసిద్ధి చెందిందని, వేలాది చిన్న వ్యాపారాలు లక్షలాది మందికి ఉపాధి కల్పించాయని తెలిపారు. కానీ.. నోట్ల రద్దు, జీఎస్టీ విధానాలు వల్ల చిన్న,మధ్య తరహా వ్యాపారాలు రోడ్డున పడ్డారని అన్నారు. పెద్దనోట్లను రద్దు సుప్రీం కోర్టు సమర్థించిన కొన్ని రోజుల తర్వాత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చేయడం గమనార్హం .

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  అగ్నిపథ్ పథకంపై కూడా కేంద్రంపై దాడి చేశారు. దీని కింద రక్షణ దళాలు సైనికులను - అగ్నివీర్స్ అని పిలుస్తారు - ఎక్కువగా కేవలం స్వల్పకాలానికి రిక్రూట్ చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో, సాయుధ దళాలలో చేరిన వారు సర్వీస్ టర్మ్, పెన్షన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆర్మీ ఔత్సాహికులుగా శిక్షణ పొందేందుకు తెల్లవారుజామున 4 గంటలకు లేచే యువత కలలను ఈ పథకం ఛిన్నాభిన్నం చేసిందన్నారు. ఇప్పుడు 25 శాతం అగ్నివీర్లు మాత్రమే మిలిటరీలో విలీనం అవుతారని, మిగిలిన వారు నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. నిరుదోగ్య యువతకు ఇచ్చిన వాగ్దానాలను ప్రధాని మోదీ, బీజేపీ తుంగలో తొక్కాయని ఆరోపించారు. 

అస్వస్థతకు గురైన తన తల్లి సోనియాను కలిసిన తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత శుక్రవారం ఉదయం సనోలి పానిపట్ రోడ్ నుండి హర్యానాలో భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ నుంచి యాత్ర గురువారం సాయంత్రం హర్యానాలోని పానిపట్ జిల్లాలోకి ప్రవేశించింది . షెడ్యూల్ ప్రకారం.. నేడు పానిపట్ జిల్లాలోని GT రోడ్, బాబర్‌పూర్ మీదుగా యాత్ర సాగింది. దీని తరువాత రాహుల్ గాంధీ పానిపట్ సెక్టార్ 13లోని హుడా మైదానంలో బహిరంగ సమావేశం జరిగింది.  ఈ ర్యాలీలో పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, భూపీందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా, రణదీప్ సింగ్ సూర్జేవాలా తదితరులు పాల్గొన్నారు.

భారత్ జోడో యాత్ర దృష్ట్యా హర్యానాలో తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. "మేము వారి (కాంగ్రెస్) నుండి రూట్ , స్టాపేజ్ సమాచారాన్ని కోరాము, పూర్తి భద్రత కల్పించాలని అధికారులను కోరాము" అని విజ్ తెలిపారు. డిసెంబర్ 21-23 వరకు హర్యానాలో మొదటి దశలో 130 కి.మీలకు పైగా ప్రయాణించిన ఈ యాత్ర నుహ్, గురుగ్రామ్, ఫరీదాబాద్ జిల్లాల గుండా జనవరి 10న పంజాబ్‌లోకి ప్రవేశిస్తుంది. తదుపరి కొన్ని రోజుల్లో హర్యానాలో..కర్నాల్, కురుక్షేత్ర,అంబాలా జిల్లాల గుండా సాగునున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios