Rahul Gandhi: పంచవర్ష ప్రణాళిక వల్లనే ఆధునిక భారతదేశానికి పునాది పడిందని, దేశం అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. పంచవర్ష ప్రణాళికల ఘనతను కీర్తించారు.
Rahul Gandhi: ప్రణాళికా సంఘం వల్లనే ఆధునిక భారతదేశానికి పునాది పడిందని, పంచవర్ష ప్రణాళికలు అమలు చేసినందుకే భారత్ అగ్రగామిగా మారిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. శనివారం ఆయన తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ రాస్తూ.. 1951 జూలై 9న దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తొలి పంచవర్ష ప్రణాళికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారని అందులో పేర్కొన్నారు. అయితే.. 2015లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేయడం గమనార్హం.
స్వాతంత్య్రం వచ్చే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, ఆ సమయంలో మన దేశ నిర్మాతలు భారతదేశాన్ని పునర్నిర్మించే మహత్తరమైన పనిని తమ చేతుల్లోకి తీసుకున్నారనీ, దేశ ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా.. మనదేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ అడుగువేశారని అన్నారు. నెహ్రూ అధ్యక్షతన దార్శనిక ప్రణాళిక సంఘం ద్వారా ప్రారంభించబడిందని తెలిపారు.
1951లో ఇదే రోజున( జూలై 9న) పండిట్ నెహ్రూ పార్లమెంట్‌లో మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారనీ, ఆ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 2.1 శాతం ఉంటుందని రాహుల్ చెప్పారు. ఆ ప్రణాళిక పూర్తయ్యే నాటికి భారతదేశ జీడీపీ 3.6 శాతానికి పెరిగిందని, అంచనాలన్నీ తప్పని రుజువు చేశాయన్నారు.
పంచ వర్ష ప్రణాళికల్లో వ్యవసాయం, నీటిపారుదల రంగంపై ప్రత్యేక దృష్టి సారించి భాక్రా డ్యామ్, హిరాకుడ్ డ్యామ్ వంటి నిర్మాణాలు ప్రారంభించారని తెలిపారు. 1956లో మొదటి పంచవర్ష ప్రణాళిక పూర్తయ్యే నాటికి ఐదు ఐఐటీలు ప్రారంభమయ్యాయని, ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని ప్రారంభించామని చెప్పారు. ఈ సందర్భంగా ఐదు స్టీల్ ప్లాంట్‌లను ప్రారంభించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.
అలాగే.. తపాలా, టెలిగ్రాఫ్, రోడ్లు, రైల్వేలు, పౌర విమానయాన రంగాలను మెరుగుపరిచేందుకు అప్పట్లో కృషి చేశారని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రణాళికా నమూనా వరుసగా 12 పంచవర్ష ప్రణాళికలలో ప్రతిబింబించిందని, ఇది ఆధునిక భారతదేశానికి పునాది వేసి దేశాన్ని అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మార్చిందని ఆయన అన్నారు. ఈ ప్రణాళికల విధానాల ద్వారా భారతదేశం యొక్క ప్రపంచ ఆర్థిక స్థాయి వెలుగులోకి వచ్చిందని, అది తన స్వంత ఆర్థిక నిర్మాణంపై ఆధారపడిందని, ఇది కాంగ్రెస్, భారతదేశ ప్రజల వారసత్వమని ఆయన అన్నారు.
