భారత్ జోడో పాదయాత్ర ప్రారంభానికి ముందు కాంగ్రెస్ మాజీ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఉద్వేగపూరితమైన సందేశాన్ని తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. విద్వేష, విభజన రాజకీయాలకు తన తండ్రి బలయ్యాడని, కానీ అటువంటి పరిస్థితుల్లో దేశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనని పేర్కొన్నారు.
రాబోయే స్వార్వత్రిక ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రణాళిక రచన చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి.. పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశ్యంతో భారత్ జోడో (Bharat Jodo) పేరుతో ఓ సుధీర్ఘమైన పాదయాత్ర చేయడానికి రాహుల్ సిద్దమయ్యారు. ఆయన తన పాదయాత్రను బుధవారం (సెప్టెంబర్ 7న) ప్రారంభించనున్నారు. ఈ యాత్ర కన్యాకుమారి నుంచి మెగా ర్యాలీగా ప్రారంభంకానున్నది.
భారత్ జోడో యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ శ్రీపెరంబదూర్‌లోని తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారకం వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఓ భావోద్వేగ పూరితమైన సందేశాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆనాడు ద్వేషపూరిత రాజకీయాల వల్ల తన తండ్రిని కోల్పోయానని, అలాంటి పరిస్థితుల్లో నేడు ప్రియమైన దేశాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేనని అన్నారు. విద్వేషం, విభజన రాజకీయాల వల్లే తన తండ్రి ప్రాణాలు కోల్పోయాడనీ, కానీ.. అటువంటి విద్వేష రాజకీయాలకు ప్రియమైన దేశాన్ని వదులుకోలేననీ అన్నారు. ప్రేమ ద్వేషాన్ని జయిస్తుందనీ, ఆశ భయాన్ని ఓడిస్తుందనీ, మనందరం కలిసి ఆవరోధాలను అధిగమిస్తామని ట్వీట్ చేశారు. 1991, మే 21న శ్రీపెరంబుదూర్ లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఏలం ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే..
రాహుల్ గాంధీ తన తండ్రి స్మారక చిహ్నాన్ని సందర్శించిన తర్వాత.. మహాత్మా గాంధీ మండపంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన కన్యాకుమారికి బయలుదేరారు. అక్కడ ఈ యాత్రను ప్రారంభానికి ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ జాతీయ జెండాను ఆయనకు అందజేయనున్నారు.
భారత్ జోడో (Bharat Jodo) పాదయాత్ర.. ఇది దేశచరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన రాజకీయ యాత్ర అని కాంగ్రెస్ పేర్కొంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు యాత్ర ప్రారంభించబడుతుంది. రేపు ఉదయం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు 118 మంది 'భారత్ యాత్రికులు' పాదయాత్రలో పాల్గొంటారు.
కాంగ్రెస్ మార్చ్ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మద్దతును కూడగట్టడానికి తీరని ప్రయత్నం. ప్రముఖ నాయకుల నిష్క్రమణతో పార్టీ పతనం అవుతోందనే తరుణంలో తరుణంలో ఈ పాదయాత్ర ప్రారంభమవుతోంది. ఇటీవలి ప్రముఖ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి వివిధ సమస్యలపై దేశాన్ని ఏకం చేయడం, సామాన్యులతో అనుసంధానం చేయడం ఈ యాత్ర లక్ష్యమని కాంగ్రెస్ పేర్కొంది.
