రాహుల్ గాంధీ ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఓ రిక్వెస్ట్ చేశారు. శుక్రవారానికి బదులు సోమవారం తనను విచారించాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆయనకు బుధవారం సమన్లు వచ్చాయి. గురువారం ఆయన తన తల్లితో హాస్పిటల్‌లో ఉండటానికి ఈడీ అనుమతి ఇచ్చింది. 

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో విచారణకు తనను సోమవారం పిలవాలని రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20వ తేదీన తనను విచారణకు పిలవాలని కోరారు. అయితే, ఈ విజ్ఞప్తిని ఈడీ అంగీకరించిందా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ, ఈ రోజు అంటే గురువారం రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ వద్ద ఉంటానని కోరితే అందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే.

రాహుల్ గాంధీని బుధవారం విచారించిన తర్వాత మళ్లీ శుక్రవారం హాజరవ్వాలని ఆదేశించింది. గురువారం తల్లి సోనియా గాంధీతో ఉండటానికి రాహుల్ గాంధీకి అనుమతి ఇచ్చింది.

మూడు రోజులుగా రాహుల్ గాంధీని ఈడీ సుమారు 30 గంటలపాటు విచారించింది.

ఈ కేసులో సోనియా గాంధీకి కూడా ఈడీ సమన్లు పంపింది. కానీ, జూన్ 2వ తేదీ ఆమె కరోనా బారినపడ్డట్టు రిపోర్టు వచ్చింది. అనంతరం కరోనా సంబంధ ఆరోగ్య సమస్యలతో ఆమె ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్‌లో ఆదివారం చేరారు. ఈ రోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరూ సోనియా గాంధీతోనే ఉన్నట్టు సమాచారం.

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా మూడో రోజు ప్రశ్నించింది. బుధ‌వారం రోజున ఆయ‌నను ఈడీ దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు ప్రశ్నించింది. ఇప్పటివరకు రాహుల్ గాంధీ 30 గంటలకు పైగా ఈడీ ప్ర‌శ్న‌ల వ‌ర్షాన్ని ఎదుర్కొన్నారు. 
ఈ క్ర‌మంలో తాజాగా మరోసారి ఈ స‌మ‌న్లను జారీ చేసింది. నోటీసులతో నాలుగో రోజు విచారించనుంది. శుక్రవారం నాడు మరోసారి ఈడీ విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని రాహుల్ గాంధీని ఆదేశించింది. 

ప‌లు మీడియా క‌థనాల ప్ర‌కారం.. సెంట్రల్ ఢిల్లీలోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఈడీ ప్రధాన కార్యాలయానికి రాహుల్ గాంధీ బుధ‌వారం ఉదయం 11.35 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ఆయన వెంట ఆయన సోదరి, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL), దాని యాజమాన్య సంస్థ యంగ్ ఇండియన్‌కు సంబంధించిన నిర్ణయాలలో రాహుల్ గాంధీ పాత్ర గురించి దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది.