చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ జోడో యాత్రను నిలిపేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా రాహుల్ గాంధీకి రిక్వెస్ట్ చేశారు. దీనిపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. తమ యాత్ర ఆపడానికే ఇప్పుడు కరోనాను కుంటిసాకుగా చెబుతున్నదని ఆరోపించారు. 

న్యూఢిల్లీ: చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. మాస్కులు ధరించడం, టీకా వేసుకోవడం, ఇతర జాగ్రత్తలను సూచిస్తున్నది. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మాస్కులు వేసుకోవాలని తెలిపింది. ఇదే తరుణంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర పైనా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా స్పందించారు.

భారత్ జోడో యాత్ర చేపడుతున్నప్పుడు మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వినియోగించాలని, వ్యాక్సిన్ వేసుకున్నవారిని మాత్రమే ఈ మార్చ్‌లో పాల్గొనడానికి అనుమతించాని, ఇలాంటి కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా లెటర్ రాశారు. ఈ కొవిడ్ ప్రొటోకాల్ ఒక వేళ పాటించడం సాధ్యం కాకపోతే ప్రజా ఆరోగ్య అత్యయిక స్థితి కోణంలో ఆలోచించి కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించడానికి, దేశ ప్రయోజనాల కోసం భారత్ జోడో యాత్ర ఆపేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి కోరారు.

Also Read: కోవిడ్‌‌పై కేంద్రం అలర్ట్.. ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం..

ఈ లేఖ పై కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంచార్జీ జైరాం రమేశ్ ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. భారత్ జోడో యాత్రను నిలిపేయడానికి ఇదొక కుట్ర అని, అందుకోసమే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయనే ఓ భావాన్ని తెచ్చారని, ఇది కేవలం భారత్ జోడ్ యాత్ర నిలిపేయడానికే చేసిన పన్నాగం అని పేర్కొన్నారు.

తాజాగా, ఈ లేఖ పై రాహుల్ గాంధీ స్వయంగా రియాక్ట్ అయ్యారు. ‘ ఈ యాత్ర ముందుగా అనుకున్నట్టే కశ్మీర్ వరకు సాగుతుందని వివరించారు. వారు ఇప్పుడు ఒక కొత్త ఐడియాతో వచ్చారు. కరోనా వస్తున్నదని, అందుకే నా యాత్ర ముగించాలని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు భారత్ యాత్ర ఆపేయడానికి అనేక రకాల సాకులు వస్తున్నాయి. బలం, దేశ నిజాలపట్ల వారు భయపడతారు’ అని రాహుల్ గాంధీ హర్యానాలో ప్రసంగంలో పేర్కొన్నారు.

చాలా మందికి ఈ యాత్రలో పాల్గొన్న తర్వాత కరోనా పాజిటివ్ అని తేలినట్టు కేంద్ర మంత్రి వివరించారు. దీనికి మీరు నిబంధనలు పెట్టినా వాటిని అన్నింటిని పాటిస్తామని కాంగ్రెస్ తెలిపింది.