న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొనేవరకు రైతులు ఢిల్లీ నుండి వెనక్కి కదలరని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 

గురువారం నాడు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను పార్టీ ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ కలిశారు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సేకరించిన  రెండు కోట్ల సంతకాలను రాష్ట్రపతికి అందించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.రైతు సమస్యలను రాష్ట్రపతికి వివరించినట్టుగా చెప్పారు. కార్పోరేట్ శక్తుల జేబులు నింపేందుకే కొత్త వ్యవసాయచట్టాలు తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.

also read:రాష్ట్రపతి భవన్ కు మార్చ్ ఫాస్ట్: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సహా పలువురు నేతల అరెస్ట్

రైతుల కోసం పనిచేస్తున్నారా... కార్పోరేటర్ల కోసం పనిచేస్తున్నారా చెప్పాలని ఆయన మోడీని కోరారు. తన కార్పోరేట్ స్నేహితుల కోసం మోడీ దేశాన్ని తాకట్టు పెడుతున్నారని ఆయన విమర్శించారు.

రైతులతో కేంద్రం నేరుగా చర్చించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.రైతుల ఉద్యమానికి  విపక్షాలు అండగా ఉంటాయని ఆయన చెప్పారు.ఇధ్దరు లేదా ముగ్గురు బడా బాబులకు సహకరించేందుకు మోడీ కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని రాహుల్ విమర్శించారు. రైతులను కేంద్రం వంచించిందన్నారు.

సమస్యలను అర్ధం చేసుకోవడంలో మోడీ పూర్తిగా వైఫల్యం చెందారని ఆయన విమర్శించారు. వ్యవసాయ రంగంలో రైతులు, కార్మికులు పెట్టుబడి పెడితే దేశంలోనే కార్పోరేట్ శక్తులకు ప్రయోజనం కలుగుతోందన్నారు.