హైదరాబాద్: తెలంగాణ శానససభ ఎన్నికల ఫలితాలతో ఢిల్లీలో చక్రం తిప్పాలని భావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల వ్యూహరచన అంతా చంద్రబాబుదే అన్నట్లు వ్యవహారం నడిచింది. ఆయన వ్యూహరచన ప్రకారమే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెసుకు కూడా ముందుకు వెళ్లిందనే అభిప్రాయం ఉంది. 

రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారం చేసినా, చంద్రబాబే ప్రధానంగా ప్రజలకు కనిపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుకు, చంద్రబాబుకు మధ్య పోరుగా తెలంగాణ ఎన్నికల సమరం సాగింది. ఇలాంటి అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో టీఆర్ఎస్ నేతలు విజయం సాధించారు.

ఆ విషయం అలా ఉంచితే, చంద్రబాబుతో పొత్తు వల్ల తెలంగాణలో జరిగిన నష్టాన్ని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎలా తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో బిజెపియేతర పక్షాలను ఏకం చేసే నేతల్లో చంద్రబాబు ముందు వరుసలో కనిపించారు. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ కూడా చంద్రబాబును బహుశా అలాగే చూసి ఉంటారు. కానీ తెలంగాణ ఎన్నికల ఫలితాలతో పరిస్థితి మారే సూచనలు కనిపిస్తున్నాయి. 

చంద్రబాబుతో దోస్తీ మట్టికరిపిస్తుందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రాహుల్ గాంధీ వైఖరిపై విమర్శలు చేస్తూ వచ్చారు. అదే నిజమని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. ఈ స్థితిలో రాహుల్ గాంధీ చంద్రబాబుతో కలిసి నడిచే విషయంపై పునరాలోచన చేస్తారా అనే చర్చ సాగుతోంది. 

అదే సమయంలో జాతీయ స్థాయిలో బిజెపియేతర కూటమికి చంద్రబాబు నాయకత్వం వహించే పరిస్థితి ఉండకపోవచ్చునని అంటున్నారు. ఆయన జాతీయ రాజకీయాలపై నీలినీడలు అలుముకున్నాయని చెప్పవచ్చు. 

చంద్రబాబును ముందుకు నెట్టే ప్రయత్నం కాంగ్రెసు చేస్తుందని తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే భావిస్తున్నారు. సోమవారం జరిగిన భేటీకి ఎస్పీ నేతలు ములాయం సింగ్ యాదవ్ గానీ అఖిలేష్ యాదవ్ గానీ హాజరు కాలేదు. బిఎస్పీ అధినేత మాయావతి కూడా దూరంగానే ఉన్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని ఉత్తరాది నేతలు ఈ స్థితిలో అంగీకరించడం కష్టమేనని భావించవచ్చు. దీనికి తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు నేపథ్యాన్ని అందిస్తాయని చెప్పడంలో సందేహం లేదు.