రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఉండాలని శరద్ యాదవ్ ఆకాంక్షించారు. ఆయన పార్టీ కోసం బాగా కష్టపడుతున్నారని, అధ్యక్ష పదవి చేపట్టడంలో ఎలాంటి తప్పు లేదని అన్నారు. 

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కోసం 24 గంట‌ల పాటు క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ని, ఆయ‌నే పార్టీకి అధ్య‌క్షుడిగా ఉండాల‌ని శ‌ర‌ద్ యాద‌వ్ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. 2018లో తాను స్థాపించిన లోక్ తాంత్రిక్ జనతా దళ్ (ఎల్జేడీ) పార్టీని ఇటీవ‌లే ఆయ‌న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో శ‌ర‌ద్ యాద‌వ్.. రాహుల్ గాంధే కాంగ్రెస్ చీఫ్ గా ఉండాల‌ని నొక్కి చెప్పారు. 

శుక్రవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఓ జ‌ర్న‌లిస్టు రాహుల్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాలా అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం ఇస్తూ..‘‘ అవును.. ఎందుకు నియ‌మించ‌కూడ‌దు ? కాంగ్రెస్ ను రాహుల్ గాంధీ 24 గంటల పాటు న‌డుపుతున్నారు. ఆయ‌న‌నే పార్టీ అధ్యక్షుడిగా చేయాలని నేను భావిస్తున్నాను. అప్పుడే ఆయ‌న ఇంకా ఏదైనా పెద్ద‌ది చేయ‌గ‌ల‌రు ’’ అని అన్నారు. అయితే రాహుల్ గాంధీ ప‌క్కన ఉన్న స‌మ‌యంలోనే యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే యాదవ్ వ్యాఖ్యల‌పై రాహుల్ గాంధీని వ్యాఖ్యానించ‌మ‌ని మీడియా కోరిన‌ప్పుడు ఆయ‌న ‘‘అది చూద్దాం’’ అని అన్నారు. 

మార్చి 2022లో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్లూసీ) సమావేశంలో పార్టీ పదవికి ఎన్నికలు జరిగే వరకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీకి నాయకత్వం వహించాలని నిర్ణయించారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘‘ ప్రతీ పార్టీ కార్యకర్త రాహుల్ గాంధీ పార్టీని నడిపించాలని కోరుకుంటున్నారు అని అన్నారు. అయితే తదుపరి సీడబ్లూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ ను ఎన్నుకుంటారు. 

లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ పార్టీలో లోక్‌తాంత్రిక్ జనతా దళ్ ఇటీవ‌లే విలీనం అయ్యింది. 1997లో జనతాదళ్ నుంచి బయటకు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆర్జేడీని స్థాపించారు. అయితే శ‌ర‌ద్ యాదవ్ మాత్రం జేడీయూలో నే ఉండిపోయారు. త‌రువాత జ‌రిగిన కొన్నిరాజ‌కీయ ప‌రిణామాల వ‌ల్ల శ‌ర‌ద్ యాద‌వ్ 2018లో ఎల్‌జేడీని స్థాపించారు. ఇక కొన్ని చ‌ర్చల త‌రువాత ఇటీవ‌లే అంటే 25 ఏళ్ల త‌రువాత ఆర్జేడీ, ఎల్జేడీని విలీనం చేశారు.