లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోర పరాజయాన్ని చవి చూసింది. గత ఎన్నికల్లో కన్నా... బీజేపీ ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించింది. దీంతో... పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ... రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా... దీనిపై తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

అధ్యక్ష పదవి నుంచి రాహుల్‌ తప్పుకొనే అవకాశమే లేదని దాదాపుగా ధ్రువీకరించింది. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాల్‌ సోమవారం.. ఈ నెల 25న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంపై వదంతులు వ్యాప్తి చేయవద్దని ప్రజలను, మీడియాను కోరారు. సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్‌ రాజీనామాకు సిద్ధపడ్డారని, అందుకు సీడబ్ల్యూసీ నిరాకరించిందని, అయినా రాహుల్‌ వెనుకకు తగ్గడం లేదని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.సీడబ్ల్యూసీ సమావేశం ఆంతరంగిక భేటీ అని, ఆ సమావేశంపై పుకార్లు, వదంతులు సృష్టించడం తీవ్ర అవాంఛనీయమని ఆయన స్పష్టం చేశారు.