Rahul Gandhi: లోక్‌సభకు అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తొలిసారిగా వాయనాడ్‌లో రోడ్‌షో నిర్వహించారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ వాద్రా కూడా వయనాడ్ చేరుకున్నారు. వయనాడ్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేరళలోని వయనాడ్ (Wayanad) నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు. లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన తరువాత రాహుల్ గాంధీ తన నియోజకవర్గం వయనాడ్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ఆయనతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కేరళ కాంగ్రెస్ సీనియర్ నేతలు వెంట ఉన్నారు. రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు యూడీఎఫ్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 'సత్యమేవ జయతే' అనే పేరుతో కల్‌పట్టా టౌన్‌లో జరిగిన రోడ్‌షో పాల్గొన్నారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బిజెపిపై విరుచుకుపడ్డారు. "ఎంపీ అంటే కేవలం ట్యాగ్. ఇది ఒక పోస్ట్.. కాబట్టి బిజెపి ట్యాగ్‌ని తొలగించవచ్చు. వారు పదవిని తీసుకోవచ్చు, వారు ఇల్లు తీసుకోవచ్చు, నన్ను జైలులో కూడా పెట్టవచ్చు, కానీ.. వారు నన్ను వాయనాడ్ ప్రజల నుంచి వేరు చేయలేరు. వారికి ప్రాతినిధ్యం వహించకుండా ఆపలేరు. నా ఇంటికి పోలీసులను పంపి నన్ను భయపెట్టాలని భావిస్తున్నారు. నా ఇంటిని 50 సార్లు తీసుకోండి, నేను వాయనాడ్, భారతదేశ ప్రజల సమస్యను లేవనెత్తుతాను. నాలుగేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి మీ ఎంపీని అయ్యాను కాని వారు నా ఇంటిని తీసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను "అని రాహుల్ గాంధీ అన్నారు.
పరువు నష్టం కేసులో దోషిగా తేలిన తర్వాత రాహుల్ గాంధీ గత నెలలో వయనాడ్ ఎంపీగా అనర్హుడయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ బంగ్లాను కూడా ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఆయన తన ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేసి తన తల్లి సోనియా గాంధీ నివాసానికి మారారు.
కేంద్రంపై ప్రియాంక గాంధీ విమర్శలు
ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మాట్లాడుతూ" కోర్టు తీర్పు వల్లే నా సోదరుడిపై అనర్హత వేటు పడింది. ప్రశ్నలు అడగడం, జవాబుదారీతనం డిమాండ్ చేయడం, దేశం స్థానిక సమస్యలను లేవనెత్తడం ఎంపీల పని. మొత్తం ప్రభుత్వం, ప్రధాని మోదీ కూడా దీనిని అన్యాయంగా భావించడం నాకు వింతగా అనిపిస్తుంది. వారి దగ్గర సమాధానం చెప్పలేని ప్రశ్నను నా సోదరుడు అడిగాడు . కాబట్టే ఈ అనర్హత వేటు." అని ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. గౌతమ్ అదానీ అనే ఒక వ్యక్తిని రక్షించడం కోసం మొత్తం ప్రభుత్వం మన ప్రజాస్వామ్యాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. గౌతమ్ అదానీని రక్షించాల్సిన బాధ్యత ప్రధాని మోదీకి ఉంది, కానీ భారత ప్రజల పట్ల ఆయనకు ఎలాంటి బాధ్యత లేదా అని నిలదీశారు.
