కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆఫీసుకు బయలుదేరారు. ఢిల్లీలోని ఎఐసీసీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు.. అక్కడి నుంచి తీసుకెళ్లారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆఫీసుకు బయలుదేరారు. ఢిల్లీలోని ఎఐసీసీ కార్యాలయం నుంచి ర్యాలీగా రాహుల్ గాంధీ బయలుదేరారు. రాహుల్‌తో పాటే ప్రియాంక గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. అయితే రాహుల్ వెంట పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈడీ కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరిన రాహుల్, ప్రియాంకలను పోలీసులు.. అక్కడి నుంచి వాహనంలో తీసుకెళ్లారు. 

మరోవైపు ఏఐసీసీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరకున్న కాంగ్రెస్ శ్రేణులు.. రోడ్డుపై బైఠాయించి ఆందోళ చేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించేందుకు సిద్దం అవుతున్నారు. రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడం పూర్తయ్యేవరకు నిరసన కొనసాగిస్తామని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. 

ఇక, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాహుల్, సోనియాలకు ఈడీ నోటీసులు జారీ చేసిందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇతర కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే నిరసన తెలిపేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం తుగ్లక్ లేన్, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డు చుట్టూ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ రెండు ప్రదేశాలకు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు మూసివేశారు. పోలీసులు వారి జాబితాలోని ముఖ్యనేతలను మాత్రమే ఏఐసీసీ కార్యాలయంలోకి అనుమతించారు. ఇక, నిరసన తెలుపుతున్న పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని.. బస్సుల్లో అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీంతో ఆ పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.