రాఫెల్ వివాదంలో ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన విమర్శల దాడిని మరింత పెంచారు. నిన్న ది హిందూ పత్రిక రాసిన కథనాలతో మోడీపై చెలరేగిన రాహుల్.. ఇవాళ ఓ జాతీయ మీడియా రాసిన కథనాన్ని ఆధారంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.

రాఫెల్ ఒప్పందానికి ముందు అనిల్ అంబానీ ఫ్రాన్స్ రక్షణమంత్రిని కలిశారని...ఆయన ఏ హోదాలో అక్కడికి వెళ్లారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రధాని మోడీ.. అనిల్ అంబానీకి మధ్యవర్తిగా వ్యవహరించారని ఆరోపించారు. దేశరక్షణకు సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచాల్సిన మోడీ... ఇతరులకు చెరవేసి దేశభద్రతను పణంగా పెట్టారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

రక్షణ శాఖలో అత్యంత కీలకమైన రాఫెల్ డీల్ గురించి రక్షణశాఖ, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, విదేశాంగ కార్యదర్శికి తెలియడానికి ముందే అనిల్ అంబానీకి ఎలా చేరిందని రాహుల్ ప్రశ్నించారు. అలాగే ఈ కుంభకోణానికి సంబంధించి కాగ్ నివేదికకు ఎలాంటి విలువా లేదని, అది కేవలం చౌకీదార్ ఆడిట్ జనరల్ రిపోర్ట్ మాత్రమేనని ఆరోపించారు.