భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని ప్రధాన మోదీ చెప్తున్నదంతా అబద్ధమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. చైనా సైన్యం మన దేశ భూ భాగాన్ని  ఆక్రమించిందని, అయినా కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు.

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మరోసారి ప్రధాని మోడీ, బిజెపి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. భారత్ భూభాగాన్ని చైనా హస్తాగతం చేసుకోలేదని ప్రధాని మోడీనే చెప్పడం సరికాదని, చైనా విషయంలో కేంద్ర ప్రభుత్వం అసలు నిజాలు చెప్పడం లేదని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత భూభాగాన్ని చైనా సైన్యం ఆక్రమించుకుందని, కానీ, మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. కార్గిల్ యుద్ధ వీరుల స్మారక కేంద్రం వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు.

‘లడఖ్ ఒక వ్యూహాత్మక ప్రదేశం. భారత్ నుంచి వేల కిలోమీటర్ల భూమిని చైనా లాక్కుంది. చైనా ఒక్క అంగుళం భూమిని కూడా లాక్కోలేదని విపక్షాల సమావేశంలో ప్రధాని మోదీ అనడం బాధాకరమన్నారు. ప్రధాని మాటలు పూర్తిగా అబద్ధం. లడఖ్ భూమిని చైనా ఆక్రమించిందని లడఖ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రధాని నిజం మాట్లాడడం లేదు. ’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. సరిహద్దులో ఎప్పుడు యుద్ధం జరిగినా లడఖ్ ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారని రాహుల్ గాంధీ అన్నారు.

లడఖ్ తన ధీరత్వాన్ని ఒక్కసారి కాదు చాలా సార్లు ప్రదర్శించిందని అన్నారు. ఇందుకు లడఖ్ ప్రజలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. లడఖ్‌ నిరుద్యోగానికి కేంద్రమనీ, ఇక్కడ ఫోన్‌ నెట్‌వర్క్‌, విమానాశ్రయం వంటి సౌకర్యాలు కూడా లేవని అన్నారు. హుల్ గాంధీ ఇంకా మాట్లాడుతూ.. తాను లడఖ్‌లోని ప్రతి మూలకు వెళ్లాననీ, అక్కడి ప్రజలతో మాట్లాడానని అన్నారు.

దేశంలో బీజేపీ, ఆరెస్సెస్ లు హింస, విద్వేషాలను వ్యాప్తి చేస్తోన్నాయనీ, వాటిని అరికట్టాలనే లక్ష్యంతోనే దేశవ్యాప్తంగా జోడో యాత్ర నిర్వహించానని తెలిపారు. ఇతర నేతలు (పీఎం నరేంద్ర మోదీ) తమ మనసులో మాట (మన్ కీ బాత్) చెప్పడంలో తీరిక లేకుండా గడుపుతారన్నారనీ, తాను మాత్రం ప్రజల మనసులోని మాటను వినాలని భావిస్తానని అన్నారు.

లడఖ్ ప్రజల సమస్యలను, వారి వాస్తవ సమస్యలను అర్థం చేసుకోవడానికి తాను ప్రయత్నించానని రాహుల్ అన్నారు. లడఖ్ ప్రజలు తమ గొంతును అణచివేస్తున్నారని చెప్పారు. లడఖ్ రక్తం, డీఎన్ఏలలో గాంధీజీ, కాంగ్రెస్ భావజాలం ఉన్నట్లు తెలిపారు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు, కానీ వాగ్దానం చేసిన హక్కులు నెరవేరలేదనీ, లడఖ్‌లోని ఏ యువతతో మాట్లాడినా.. అక్కడి సమస్యలు తెలుస్తాయని అన్నారు. 

లడఖ్ ప్రజల భూమి, ఉపాధి, సంస్కృతి, భాష కోసం చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్ వారికి అండగా నిలుస్తుందని రాహుల్ అన్నారు. లడఖ్‌లో సహజ వనరులకు కొరత లేదు. ఇక్కడ సౌరశక్తి కూడా లభిస్తుంది. ఈ విషయం బీజేపీకి తెలుసు. బీజేపీ నేతలు లడఖ్ ప్రజల నుంచి భూములు తీసుకుని ఇక్కడే అదానీ పెద్ద ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలన్నారు.లడఖ్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చకున్న పర్వాలేదు. వారిని గొంతును మాత్రం అణిచివేయకూడదని అన్నారు.