రాహుల్ గాంధీ ఆస్తుల విలువెంత..? అకౌంట్లో ఎంతుంది... చేతిలో ఎంతుంది?
మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీ మనవడు, రాజీవ్ గాంధీ తనయుడు రాహుల్ గాంధీ స్థిర చరాస్తుల విలువ తెెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తన నామినేేషన్ సందర్భంగా ఆస్తిపాస్తుల వివరాలను రాహుల్ బయటపెట్టారు.
వయనాడ్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి దక్షిణాది నుండే లోక్ సభ బరిలో నిలిచారు. కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానంలో మరోసారి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన వయనాడ్ లో నామినేషన్ కూడా వేసారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆస్తిపాస్తులతో ఇతర వివరాలు బయటకు వచ్చాయి. వీటిపై దేశ ప్రజల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
నామినేషన్ పత్రాలతో పాటు తన స్థిరచరాస్థులతో కూడిన అఫిడవిట్ ను ఎన్నికల అధికారికి అందించారు రాహుల్. ఇందులో తనకు మొత్తం రూ.20 కోట్ల స్థిర చరాస్తులు వున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ఆస్తులే కాదు అప్పులు కూడా భారీగానే వున్నట్లు రాహుల్ వెల్లడించారు. మొత్తం గా రూ.49.7 లక్షల అప్పులు వున్నట్లు రాహుల్ ప్రకటించారు.
రాహుల్ గాంధీ బ్యాంక్ అకౌంట్ లో కేవలం రూ.26.25 లక్షలు మాత్రమే వున్నాయట. ఇక స్టాక్ మార్కెట్ లో రూ.4.3 కోట్ల పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్ లో రూ.3.81 కోట్ల డిపాజిట్స్ వున్నాయని తెలిపారు. అలాగే రూ.15.2 కోట్ల గోల్డ్ బాండ్స్ ను రాహుల్ కలిగివున్నారు. అలాగే నేషనల్ సేవింగ్, పోస్టల్ సేవింగ్స్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ పాలసీలు... ఇలా మరికొన్నిట్లో రూ.61.52 కోట్ల రూపాయలు వున్నట్లు రాహుల్ వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ.1,02,78,680 కోట్లుగా రాహుల్ ఈసికి తెలిపారు.
రాహుల్ తాజా అఫిడవిట్ ప్రకారం చూసుకుంటే 2019 తో పోలిస్తే ప్రస్తుతం 59 శాతం చరాస్థులు పెరిగాయి. 2019 లో రూ.5.8 కోట్లుగా వున్న చరాస్తులు 2024 కు వచ్చేసరికి రూ.9.24 కోట్లకు పెరిగాయి. అయితే ప్రస్తుతం రాహుల్ చేతిలో కేవలం రూ.55,000 మాత్రమే వున్నాయట.
తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి వ్యవసాయ భూములు వున్నట్లు రాహుల్ వెల్లడించారు. ఇక న్యూడిల్లీ గురుగ్రామ్ లో రూ.11 కోట్ల విలువైన కార్యాలయ ప్రాంతం వున్నట్లు రాహుల్ వెల్లడించారు.
ఇక తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను కూడా రాహుల్ గాంధీ బైటపెట్టారు. అత్యాచార బాధితురాలి వివరాలను బయటపెట్టినందుకు రాహుల్ పై ఫోక్సో కేసు నమోదయ్యింది. అలాగే పరువునష్టం, నేరపూరిత కుట్ర కేసులు కూడా రాహుల్ పై వున్నారు. ఇలా రాహుల్ పై మొత్తం 18 క్రిమినల్ కేసులు వున్నాయి. ఈ వివరాలన్నింటిని ఎన్నికల కమీషన్ కు తెలియజేసారు రాహుల్ గాంధీ.
వయనాడ్ లో రాహుల్ తో పోటీపడేది వీళ్లే :
గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నుండి పోటీచేసి గెలిచారు. 2019 లో కాంగ్రెస్ కూటమి అత్యుత్తమ ప్రదర్శనను కేరళలో కనబర్చింది. మొత్తం 20 స్థానాలకు గాను 19 చోట్ల కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఎ గెలిచింది. ప్రధాని అభ్యర్థిగా పేర్కొంటున్న రాహుల్ కూడా ఇక్కడినుండే పోటీచేయడం యూపిఎ కూటమి విజయానికి తోడ్పడింది. అందువల్లే ఈసారి కూడా వయనాడ్ నుండే పోటీలో నిలిచారు రాహుల్ గాంధీ.
రాహుల్ గాంధీపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) అన్ని రాజాను పోటీ చేయిస్తోంది. ఈమె సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా భార్య. ఈమెకూడా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసారు. ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సుందరన్ కూడా వయనాడ్ లోనే పోటీ చేస్తున్నారు. ఇలా హేమాహేమీలు తలపడుతుండటంతో వయనాడ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.