కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కర్ణాటకలో తమ పార్టీని గెలిపించిన ప్రజలకు థాంక్స్ చెప్పారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కర్ణాటకలో తమ పార్టీని గెలిపించిన ప్రజలకు థాంక్స్ చెప్పారు. ‘‘కర్ణాటక ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కర్ణాటకలో క్రోని క్యాపిటలిస్టులకు, పేదలకు మధ్య యుద్దం జరిగిందని అన్నారు. పేద ప్రజలు కర్ణాటకలో క్రోనీ క్యాపిటలిస్టులను ఓడించారని అన్నారు. బలవంతులపై పేదల శక్తే గెలిచిందని చెప్పారు. కాంగ్రెస్ పేదల తరఫున పోరాడిందని చెప్పారు. తాము ఈ యుద్దంలో ద్వేషంతో బరిలో దిగలేదని.. ప్రేమ, అప్యాయతతో పోటీ చేశామని అన్నారు. 

కర్ణాటకలో ద్వేషపూరిత మార్కెట్‌ను మూసివేయబడిందని.. ప్రేమ దుకాణాలు తెరవబడ్డాయని రాహుల్ పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ ఇవే ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇది కర్ణాటక విజయం అని అన్నారు. కర్ణాటక ప్రజలకు తాము ఇచ్చిన ఐదు వాగ్దానాలను తొలి కేబినెట్ భేటీలోనే నేరవేరుస్తామని చెప్పారు.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఐదు హామీలను ప్రధానంగా ప్రస్తావించింది. గృహజ్యోతి.. అన్ని కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహ లక్ష్మి.. ప్రతి కుటుంబానికి చెందిన మహిళకు రూ. 2,000 నెలవారీ సాయం, అన్న భాగ్య.. బిపిఎల్ కుటుంబంలోని ప్రతి సభ్యునికి 10 కిలోల బియ్యం, యువ నిధి.. రెండేళ్ల పాటు నిరుద్యోగ గ్రాడ్యుయేట్ యువతకు ప్రతి నెలా రూ. 3,000, నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లకు రూ. 1,500 అందజేయడం, శక్తి.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం. 

ఇక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ మార్క్‌ను అధిగమించి స్థానాలను సొంతం చేసుకుంది. కన్నడ ప్రజలు కూడా గత 38 ఏళ్లుగా కొనసాగుతున్న ఐదేళ్లకోకసారి అధికార మార్పిడి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. కాంగ్రెస్‌కు విజయం కట్టబెట్టారు. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా.. అధికారం దక్కించుకోవడానికి 113 సీట్లను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ ఇప్పటికే 120కి పైగా స్థానాల్లో విజయం సాధించగా.. మరో 10 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందజలో కొనసాగుతున్నారు. ఇక, బీజేపీ 70 స్థానాలలోపే పరిమితం కాగా, జేడీఎస్ 25 స్థానాలు కూడా గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదు.