Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో అడుగు పెట్టిన రాహుల్ భారత్ జోడో యాత్ర.. పార్టీ శ్రేణుల ఘన స్వాగతం..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈరోజు ఉదయం ఢిల్లీలోకి ప్రవేశించింది. హర్యానాలోని ఫరీదాబాద్ వైపు నుంచి.. ఢిల్లీకి చేరుకున్న రాహుల్ గాంధీకి బదర్‌పూర్‌‌ వద్ద పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. 

Rahul gandhi bharat jodo yatra enters in delhi
Author
First Published Dec 24, 2022, 9:43 AM IST

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈరోజు ఉదయం ఢిల్లీలోకి ప్రవేశించింది. హర్యానాలోని ఫరీదాబాద్ వైపు నుంచి.. ఢిల్లీకి చేరుకున్న రాహుల్ గాంధీకి బదర్‌పూర్‌‌ వద్ద పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. బదర్‌పూర్‌లోని ఢిల్లీ సరిహద్దు వద్ద గాంధీ, భారత్ జోడో యాత్రికులకు కాంగ్రెస్ ఢిల్లీ యూనిట్ చీఫ్ అనిల్ చౌదరితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. హర్యానాలోని ఫరీదాబాద్ వైపు నుంచి యాత్ర ఢిల్లీకి చేరుకుంది.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వెంట కుమారి సెల్జా, రణదీప్ సూర్జేవాలా, శక్తిసిన్హ్ గోహిల్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా వంటి పార్టీ సీనియర్లు ఉన్నారు. ఈ రోజు దేశ రాజధానిలో సాగనున్న రాహుల్ గాంధీ యాత్రలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంకేఎం) పార్టీ అధినేత కమల్ హాసన్‌‌ కూడా నేడు రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొననున్నారు. 

ఇక, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేటితో 108రోజుకు చేరింది. ఈ రోజు రాహుల్ యాత్ర ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఆశ్రమ్ చౌక్ వద్ద ఆగుతుంది. విరామం అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు రాహుల్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. మధుర రోడ్డు, ఇండియా గేట్, ఐటీవో మీదుగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎర్రకోట వద్దకు చేరుకుంది. రేపటి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్రకు 9 రోజుల విరామం ఉండనుంది. జనవరి 3న ఢిల్లీ నుంచి రాహుల్ పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. 

ఇక, సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర యాత్ర ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో సాగింది. జనవరి చివరి నాటికి రాహుల్ యాత్ర జమ్మూ కాశ్మీర్‌లో ముగియనుంది. రాహుల్ యాత్ర ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక,  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలోని తొమ్మిది రాష్ట్రాల్లోని 46 జిల్లాల్లో దాదాపు 3,000 కిలోమీటర్ల మేర సాగింది. 

ఇదిలా ఉంటే.. కరోనా వైర‌స్ ప్రోటోకాల్స్ పాటించకపోతే భారత్ జోడో యాత్రను నిలిపివేయడం లేదా వాయిదా వేయడం గురించి ఆలోచించాలని కోరుతూ కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లకు  ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండ‌వీయ లేఖ రాశారు. అయితే దీనిపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఢిల్లీలోకి అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం కోవిడ్ నిబంధలన పేరుతో డ్రామా ఆడుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios