కేంద్ర బడ్జెట్‌ (Union Budget 2022) తీవ్ర నిరాశకు గురిచేసిందని విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ బడ్జెట్‌తో సామాన్యులకు ప్రయోజనం శూన్యమని విమర్శించారు. మధ్యతరగతి ప్రజలకు, యువత, రైతులు, మహిళలకు అందించేది ఏమీ లేదని విపక్ష నేతలు మండిపడుతున్నారు. 

కేంద్ర బడ్జెట్‌ (Union Budget 2022) తీవ్ర నిరాశకు గురిచేసిందని విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ బడ్జెట్‌తో సామాన్యులకు ప్రయోజనం శూన్యమని విమర్శించారు. మధ్యతరగతి ప్రజలకు, యువత, రైతులు, మహిళలకు అందించేది ఏమీ లేదని విపక్ష నేతలు మండిపడుతున్నారు. కేంద్రం నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. జీరో సమ్ బడ్జెట్ అని విమర్శించారు. వేతన జీవులకు, మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు, నిరూపేదలకు, యువతకు, రైతులకు, ఎంఎష్‌ఎంఈలకు ఒరిగేదేమీ లేదన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

‘కరోనా కారణంగా వేతనాల్లో కోతలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో.. భారతదేశంలోని వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలు ఉపశమనం కోసం ఎదురుచూశారు. ఆర్థిక మంత్రి, ప్రధాన మంత్రి.. ప్రత్యక్ష పన్ను చర్యలలో వారిని మళ్లీ తీవ్ర నిరాశకు గురిచేశారు. ఇది వేతన జీవులకు, మధ్య తరగతికి ద్రోహ’ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు.

ఈ బడ్జెట్ ధనవంతులకు మాత్రమేనని.. ఇందులో పేదలకు ఏమీ లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మహాభారతం ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన.. ఇది అర్జునుడి, ద్రోణచార్యుడి బడ్జెట్ అని, ఎకలవ్యునిది కాదని అన్నారు. ప్రభుత్వ స్నేహితులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ ఉందని మండిపడ్డారు. 

-‘నిరుత్సాహపరిచే బడ్జెట్. అచ్ఛే దిన్‌ను మరింత దూరం చేసింది. మధ్య తరగతికి ఉపశమనం లేదు’- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్

-‘నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్య ప్రజలకు బడ్జెట్‌లో ప్రయోజనం శూన్యం’- పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ

ఇక, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 39 లక్షల 45 వేల కోట్ల అంచనాలతో వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌ ముందు ఉంచారు. బడ్జెట్‌లో ముఖ్యంగా మౌలిక సదుపాయాల వ్యయంపై అత్యధిక దృష్టి పెట్టారు. ట్యాక్స్ అసెస్‌మెంట్ ఇయర్ ముగింపు నుండి రెండేళ్లలోపు అప్‌డేటేడ్ ట్యాక్స్ ను చెల్లించవచ్చని కేంద్ర మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్ పన్ను మినహాయింపు పరిమితిని 10 శాతం నుండి 14 శాతానికి పెంచినట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. స్టార్టప్‌లకు పన్ను మినహాయింపు మరో ఏడాది పొడిగించనున్నట్టుగా తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే దేశీయ తయారీ కంపెనీలకు పన్ను రాయితీలు ఇస్తామన్నారు. 

అయితే వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్‌లలో మాత్రం ఎలాంటి మార్పులను ప్రకటించలేదు. కార్పొరేటు సర్‌ఛార్జ్ 12 నుంచి 7 శాతానికి తగ్గించబడింది. అదే విధంగా త్వరలోనే డిజిటల్ కరెన్సీ తీసుకురానున్నట్టుగా నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీపై 30 శాతం పన్ను విధించనున్నట్టుగా చెప్పారు. మరోవైపు 5జీ సేవలను వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా తెలిపారు. రాష్ట్రాలకు రూ. లక్ష కోట్లను సాయంగా కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ వడ్డీ రహిత రుణాలు.. రాష్ట్రాల సాధారణ రుణాలకు అదనమని పేర్కొన్నారు.