కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ.. అధికారిక పార్టీలపై విమర్శలు గుప్పించారు. అగ్నివీర్ పేరుతో యువత జీవితాలతో ఆడుకుంటున్నదని అన్నారు. అలాగే, నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుడి నడ్డీ విరిచారని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర చేపడుతున్న కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై మండిపడడ్ారు. ‘భారత రాజ్యాంగాన్ని కాపాడటానికి భారత్ జోడో యాత్ర చేపడుతున్నాం. రైతుల ప్రాథమిక అవసరాల్లో డీజిల్, పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు ఉంటాయి. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఈ రేట్లను కూడా పెంచేసింది’ అని రాహుల్ గాంధీ అన్నారు.
అగ్నివీర్ స్కీమ్‌తో మోడీ సారథ్యంలోని ప్రభుత్వం యువత సెంటిమెంట్లతో ఆడుకుంటున్నదని వివరించారు. ‘అగ్నివీర్లు కావాలని మోడీ ప్రభుత్వం అంటుంది. ఆరు నెలల పాటు ట్రెయినింగ్ తీసుకుని నాలుగేళ్ల పాటు ఆర్మీలో పని చేసి ఆ తర్వాత నిరుద్యోగిగా మార్చేస్తున్నారు. ఇది ఎక్కడి జాతీయ వాదం? వారు అగ్నివీర్ పేరిట యువత సెంటిమెంట్లతో ఆడుకుంటున్నారు’ అని రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు చేశారు.
భారత్ జోడ్ యాత్ర మొదలు పెట్టి 70 రోజులు గడిచాయని, ఈ యాత్రలో ఏ ఒక్కటైనా ద్వేష ఘటన అయినా జరిగిందా? అని అడిగారు. కులం, మతం ఆధారంగా ఏ ఒక్కరినీ విభజించలేదని అన్నారు. ఎవరిని వెనక వదిలిపెట్టలేదని, కర్షకులు, కార్మికులు భారత్ జోడో యాత్రలో భాగం కావాలని అనుకుంటున్నారని వివరించారు.
కాగా, ఈ భారత్ జోడో యాత్ర తాలూకు ప్రభావం ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పడబోదని కాంగ్రెస్ మీడియా ఇంచార్జీ జైరాం రమేశ్ అన్నారు. ఇప్పుడు జరుగుతున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఈ యాత్ర ప్రభావం దాదాపు ఉండబోదన్నారు. అయితే, ఒక వేళ యాత్ర ప్రభావం ఏమైనా ఉంటే అది 2024 సార్వత్రిక ఎన్నికల్లో కనిపిస్తుందని అన్నారు.
