కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దాని తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితులపై ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు తీవ్రంగా మోదీ ప్రభుత్వాన్ని విమర్శించాయి. ఈ నేపథ్యంలో శనివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పలు పార్టీల నేతలు జమ్ము కశ్మీర్‌లో పర్యటించనున్నారు.

రాహుల్ వెంట కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జేడీ నుంచి మనోజ్ జాతో పాటు డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా వెళ్లనున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ ప్రజల్లో ఎలాంటి పరిస్థితులన్ని ఎదుర్కొంటున్నారనే విషయాలపై అక్కడి ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అనుమతిస్తే సమస్యాత్మకంగా ఉన్న శ్రీనగర్ ప్రాంతంలో పర్యటించేందుకు వీరంతా భావిస్తున్నారు . జమ్ము కశ్మీర్ పర్యటన నేపధ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు దీనిపై శుక్రవారం చర్చించారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌ ప్రజలు సాధారణ జీవనాన్ని కొనసాగించలేకపోతున్నారని, సైనిక బలగాల మోహరింపుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తాను ఖచ్చితంగా ఆ ప్రాంతంలో పర్యటిస్తానని గతంలో రాహుల్ చెప్పారు. దీనిపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందిస్తూ.. రాహుల్ వస్తానంటే విమానాన్ని కూడా పంపిస్తానని అన్నారు.

మరోవైపు రద్దు తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస నేత గులాంనబీ ఆజాద్, సీపీఐ నేత రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి లను ఇదివరకు పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. రాజకీయ నాయకులు ఎవరూ తమ ప్రాంతానికి రావద్దు అంటూ అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం రాహుల్ నేతృత్వంలోని ఈ బృందం పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.