న్యూఢిల్లీ: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు బెయిల్ పిటిషన్ మీద మధ్యాహ్నం తిరిగి విచారణ ప్రారంభమైంది. అధికార పార్టీని రఘురామ కృష్ణమ రాజు విమర్శిస్తున్నారు కాబట్టే కేసు పెట్టారని ఆయన తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ అన్నారు. దానికి సిఐడి తరపు న్యాయవాది దుష్యంత్ దవే అడ్డు పడ్డారు. కేసుతో సంబంధం లేని విషయాలు ముందుకు తేవద్దని ఆయన అన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడమే కాకుండా జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కేసు వేశారని ఆయన చెప్పారు. 

దానికి రోహత్గీ స్పందిస్తూ తాను ఏం చెప్పదలుచుకున్నానో అది చెబుతున్నానని అన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. సీనియర్ న్యాయవాదులు ఘర్షణ పదవద్దని సూచించారు. రఘురామ కృష్ణమ రాజుకు బెయిల్ రావద్దనే 124 (ఏ) పెట్టారని ముకుల్ రోహత్గీ అన్నారు. రఘురామను రాష్ట్ర పోలీసులు వేధించారని ఆయన ఆరోపించారు. రఘురామ కాలికి అయిన గాయాలపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు 

ఆర్మీ ఆస్పత్రి నివేదిక అసంపూర్ణంగా సిఐడి తరపు న్యాయవాది దవే వాదించారు. బెయిల్ కోసం ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ సుప్రీంకోర్టుకు రావడం సరి కాదని అభిప్రాయపడ్డారు. క్రిస్టియన్లకు, రెడ్లకు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామ మాట్లాడారని ఆయన అన్నారు ఎంపీగా ఉన్నప్పుడు ఎక్కువ బాధ్యతతో ఉండాలని ఆయన అన్నారు. రఘురామ కృష్ణమ రాజు కాలి మునివేళ్లకు గాయాలు ఉన్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నివేదికలో తేలింది. అంతేకాకుండా ఎడిమా ఉన్నట్లు కూడా నివేదిక తెలియజేసింది. 

ఇదిలావుంటే, వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నిర్వహించిన వైద్య పరీక్షల్లో సంచలన విషయాలు బయటపడినట్లు ఆర్థమవుతోంది. ఆర్మీ ఆస్పత్రి నివేదిక తమకు అందిందని సుప్రీంకోర్టు తెలిపింది. రఘురామ కృష్ణమ రాజు బెయిల్ పిటిషన్ మీద శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. రఘురామ కాలి వేలికి ఫ్రాక్చర్ ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 

తమకు ఎవరైనా ఒక్కటేనని సుప్రీంకోర్టు తెలిపింది రఘురామ గాయాలు తనకు తానే చేసుకున్నాడేమో తెలియదని సిఐడి వాదించింది. ఆర్మీ ఆస్పత్రి నివేదిక తమకు అందలేదని సిఐడి తెలిపింది. దీంతో ఆర్మీ ఆస్పత్రి నివేదికను సిఐడికి, పిటిషనర్లకు మెయిల్ చేస్తామని తెలిపింది. 

రఘురామ కృష్ణమ రాజు కాలి ఎముక విరిగిందని, ఇతర గాయాలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. సిఐడి కస్టడీలో రఘురామ కృష్ణమ రాజును కొట్టారనేది వాస్తవమని తేలినట్లు రఘురామ తరఫు న్యాయవాది అన్నారు. ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని న్యాయవాది ప్రశ్నించారు.  రఘురామ కృష్ణమ రాజు వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. 

విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని సిఐడి కోరింది. దానికి అభ్యంతరం తెలుపుతూ, ఈ రోజు విచారణ పూర్తి చేసి సిబిఐ విచారణకు ఆదేశించాలని రఘురామ తరఫు న్యాయవాది కోరారు.  రఘురామకు బెయిల్ మంజూరు చేయానలని కోరారు. విచారణ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది.