రాహుల్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం... క్షమాపణలు కోరుతున్న మత పెద్దలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. అలాగే, రాహుల్ వ్యాఖ్యలను మత పెద్దలు తప్పుపడుతున్నారు.

Rage over Rahul's comments... Religious leaders asking for forgiveness GVR

దేశంలో ఇటీవలే 18వ లోక్‌సభ కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యుల ప్రమాణం పూర్తయింది. లోక్‌సభ స్పీకర్‌గా రెండోసారి ఓంబిర్లా ఎన్నికయ్యారు. అనంతరం పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాదాలు తెలిపే తీర్మానం సభ్యులు ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ప్రతిపక్ష పార్టీల ప్రతినిధిగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగంలో, రాహుల్ శివుని అభయముద్రను ప్రస్తావించారు. ఆ చిత్రాన్ని కూడా చూపించారు. దీనిపై అధికార కూటమి నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 1.42 గంటల పాటు సాగిన రాహుల్ ప్రసంగంలోని సారాంశాలకు ప్రధాని మోదీ స్వయంగా స్పందించాల్సి వచ్చింది. కాగా, రాహుల్ తన ప్రసంగంలో వివిధ మతాల గురించి మాట్లాడారు. అహింసతోనే బీజేపీని ఎదుర్కోవాలన్నారు. ఈ క్రమంలో రాహుల్‌ మాట్లాడుతున్నంత సేపు లోక్‌సభలో అధికార పక్ష నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. 

ఇప్పుడు రాహుల్‌ వ్యాఖ్యలపై మత పెద్దలు సైతం స్పందిస్తున్నారు.  రాహుల్‌ చదువుకోవాలని సలహా ఇస్తున్నారు. హిందూ సమాజాన్ని అవమానించడంతో పాటు పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పరువు తీశారు...
రాహుల్ గాంధీ ప్రసంగంపై స్వామి అవధేశానంద్ గిరి ఇలా స్పందించారు. ‘‘హిందువులు ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి చూస్తారు. హిందువులు అహింసావాదులు, ఇంకా ఉదారవాదులు. హిందువులు ప్రపంచం మొత్తం తమ కుటుంబమని, అందరి క్షేమం, ఆనందం, గౌరవం కోసం ఎల్లప్పుడూ ప్రార్థించాలని చెబుతారు. హిందువులను హింసాత్మకంగా పిలవడం లేదా వారు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తారని అనడం సరికాదు. ఇలాంటి మాటలు చెప్పి మొత్తం సమాజాన్ని అవమానించడమే కాకుండా పరువు తీస్తున్నారు. హిందూ సమాజం చాలా ఉదారవాదం కలిగి ఉంటుంది. అందరినీ కలుపుకొని అందరినీ గౌరవిస్తుంది’’ అని తెలిపారు.
అలాగే, హిందువులు హింసాత్మకులని, హిందువులు విద్వేషాన్ని పెంచుతారని రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నారని... ఆయన మాటలను ఖండిస్తున్నానని చెప్పారు. రాహుల్ తన  మాటలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

 

ఇస్లాంలో అభయముద్ర ప్రస్తావన లేదు
మరోవైపు, అఖిల భారత సూఫీ సజ్జదాన్‌షిన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సయ్యద్‌ నస్రుద్దీన్‌ చిస్తీ సైతం రాహుల్ వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. ఇస్లాంలో అభయముద్ర ఉందన్నారు. ఇస్లాంలో విగ్రహారాధన ప్రస్తావనే లేదు. ఏ విధమైన కరెన్సీ కూడా లేదు. నేను దీనిని ఖండిస్తున్నాను. ఇస్లాంలో అభయముద్ర ప్రస్తావన లేదు. రాహుల్ గాంధీ తన ప్రకటనను సరిదిద్దుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.
అలాగే, దర్గా అజ్మీర్ షరీఫ్ పిఠాధిపతి హాజీ సయ్యద్ సల్మాన్ చిస్తీ మాట్లాడుతూ.. ‘‘మేము ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటనను విన్నాం. అతను 'అభయముద్ర' చిహ్నాన్ని ఇస్లామిక్ ప్రార్థన లేదా ఇస్లామిక్ ఆరాధనతో అనుసంధానించడం గురించి మాట్లాడారు. అయితే, ఇది ఏ పవిత్ర గ్రంథం లేదా సాధువుల బోధనల్లో ప్రస్తావించలేదు. ఇస్లాం తత్వశాస్త్రం, విశ్వాసంతో మరే ఇతర సంకేత సంజ్ఞను అనుబంధించడం సరైనది కాదు. ఏ మతం లేదా విశ్వాసంతో ఏ చిహ్నాలు ముడిపడి ఉన్నాయో రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలి’’ అని హితవు పలికారు.

 

పూర్తి సమాచారం లేకుండా మాట్లాడకూడదు...
రాహుల్ మాటలపై బీహార్‌లోని గురుద్వారా పాట్నా సాహిబ్ అధ్యక్షుడు జగ్జోత్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభలో మతాలకు సంబంధించిన వాస్తవాలను ప్రదర్శించిన తీరును తప్పుపట్టారు. రాహుల్‌కు సరైన సమాచారం లేదని అభిప్రాయపడ్డారు. సభలో అసంపూర్ణ సమాచారం, తప్పుడు సమాచారం అందించారని... సిక్కు మతమైనా, హిందూ మతమైనా, మరే ఇతర మతమైనా, ఏ మతానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటే తప్ప దాని గురించి మాట్లాడకూడదని సూచించారు. పూర్తి సమాచారం ఉన్న తర్వాతే మాట్లాడాలని చెప్పారు.

1984 అల్లర్ల బాధితులకు క్షమాపణ చెప్పాలి...
అలాగే, రాహుల్‌ హింస గురించి మాట్లాడటం చాలా మంచిదని జగ్జోత్ సింగ్ అన్నారు. అయితే, 1984లో సిక్కులపై జరిగిన హింస గురించి తనకు బహుశా తెలియదేమోనని వ్యాఖ్యానించారు. చాలా మంది బాధిత కుటుంబాలు ఢిల్లీలోనే నివసిస్తున్నాయని... రాహుల్ గాంధీ ఒక్కసారి వారి వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 

రాహుల్ పార్లమెంటులో అసలేం మాట్లాడారు..? 
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ... హిందూ మతం, శివుని అభయముద్ర గురించి ప్రస్తావించారు. శివుడు, గురునానక్, జీసస్ క్రైస్ట్, లార్డ్ బుద్ధ, లార్డ్ మహావీర్ ప్రపంచం మొత్తానికి అభయముద్ర చిహ్నాన్ని అందించారన్నారు. అభయముద్ర అంటే భయపడవద్దని, బెదిరిపోవద్దని అర్థం చెప్పారు. అలాగే, రాహుల్ తన ప్రసంగ సమయంలో లోక్ సభలో శివుడి చిత్రాన్ని కూడా చూపించారు. దీనిపై అధికార పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా చిత్రాలను చూపించవద్దని రాహుల్‌ను కోరారు. ఈ క్రమంలో అధికార పార్టీ సభ్యులు పలువురు జోక్యం చేసుకొని.. రాహుల్‌ వ్యాఖ్యలపై అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. 

అభయముద్ర ద్వారా ప్రపంచం మొత్తానికి భయం, బెదిరింపులు నిషేధించబడ్డాయని స్పష్టమైన సందేశం ఇచ్చారని రాహుల్‌ అన్నారు. ఇస్లాం మతాన్ని కూడా ప్రస్తావిస్తూ ఖురాన్‌లో బెదిరింపు నిషేధమని స్పష్టంగా పేర్కొన్నారని, అయితే అధికార పార్టీకి చెందిన వ్యక్తులు బెదిరింపులతో పాటు హింసను వ్యాప్తి చేశారని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ, షా తీవ్ర అభ్యంతరం...
రాహుల్ ప్రసంగం మధ్యలో జోక్యం చేసుకున్న ప్రధాని మోదీ.. ఈ అంశం చాలా తీవ్రమైందన్నారు. మొత్తం హిందూ సమాజాన్ని హింసాత్మకంగా చూపించడం తప్పని అభ్యంతరం తెలిపారు. హోంమంత్రి షా కూడా రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దీనిపై రాహుల్ మాట్లాడుతూ.. 'హిందూ అంటే బీజేపీ, ఆరెస్సెస్, ప్రధాని మోదీ మాత్రమే కాదన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios