చెన్నై: సినీ నటి రాధిక వచ్చే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఎస్ఎంకే నేత శరత్ కుమార్ చెప్పారు. భర్త శరత్ కుమార్ నాయకత్వంలోని సమవత్తువ మక్కల్ కట్చి (ఎస్ఎంకె) మహిళా విభాగాం ఇంచార్జీగా రాధిక వ్యవహరిస్తున్నారు. 

రానున్న ఎన్నికల్లో రాధిక పోటీ చేస్తారని శరత్ కుమార్ ప్రకటించారు. తాము అన్నాడియంకె కూటమలో ఉన్నామని, అధిక సీట్లు అశిస్తున్నామని, ప్రత్యేకమైన గుర్తుపై తాము పోటీ చేస్తామని ఆయన చెప్పారు. 

ఇదిలావుంటే, కాంగ్రెసులో ఏళ్ల తరబడిగా పనిచేస్తూ వచ్చిన కరాటే త్యాగారాజన్ బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన తర్వాత త్యాగరాజన్ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ ప్రకటన కోసం నిరీక్షించారు. అయితే, అది కార్యరూపం దాల్చకపోవడంతో ఇప్పుడు బిజెపిలో చేరాలని అనుకుంటుననట్లు తెలుస్తోంది. 

తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ ముగించారు. మలి విడత ఎన్నికల ప్రచారం కోసం సిద్ధమయ్యారు. ఆయన 14వ తేదీ నుంచి ఆరు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే, 14వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో రాహుల్ గాంధీ తన పర్యటనలో మార్పులు చేసుకున్నారు. 15వ తేదీ తర్వాత ఆయన ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.