తనను జట్టుపట్టుకొని మరీ తన అత్త కొట్టిందంటూ ఐశ్వర్యారాయ్ ఫిర్యాదు చేసింది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కి... ఐశ్వర్యారాయ్ తో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. కాగా... పెళ్లైన కొంతకాలానికి వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తేజ్ ప్రతాప్ యాదవ్.. విడాకుల కోసం అప్లై కూడా చేసుకున్నారు.

కాగా.. తాజాగా ఐశ్వర్య రాయ్.. అత్త రబ్రీ దేవిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘పాట్నా నగరంలోని మాజీ సీఎం నివాసగృహమైన 10 సర్కులర్ రోడ్డు ఇంట్లో అత్త రబ్రీదేవీ నా జుట్టు పట్టుకొని కొట్టి బాడీగార్డుల సాయంతో నన్ను ఇంటి నుంచి బయటకు గెంటివేసింది.’’ అని ఐశ్వర్యారాయ్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ ఘటన అనంతరం ఐశ్వర్యారాయ్ తండ్రి, ఎమ్మెల్యే అయిన చంద్రికారాయ్ రబ్రీదేవి ఇంటికి హుటాహుటిన వచ్చారు. సచివాలయ పోలీసులు రబ్రీదేవి ఇంటికి వెళ్లి సంఘటన గురించి ఆరా తీశారు. ఐశ్వర్యారాయ్ ఫిర్యాదు మేర తాము రబ్రీదేవి ఇంటికి దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపించామని డీఎస్పీ రాకేష్ ప్రభాకర్ చెప్పారు.

ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ తన అత్తింటి బాడీగార్డులు తనను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని ఐశ్వర్యారాయ్ ఫిర్యాదు చేశారు.