మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు భారత్ సహా అరబ్ దేశాల్లోనూ ఆందోళనలు రేపుతున్నాయి. యూపీ కాన్పూర్‌లో ఘర్షణలు చోటుచేసుకోగా.. అరబ్ దేశాల్లో భారత వస్తువులు, సినిమాలను బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఖతర్ ప్రభుత్వం అక్కడి భారత అంబాసిడర్‌కు సమన్లు పంపింది. మహమ్మద్ ప్రవక్తపై ఆ నేతలు చేసిన వ్యాఖ్యలు భారత ప్రభుత్వ దృక్పథానికి వ్యతిరేకమైనవని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: ఓ టీవీ డిబేట్‌లో మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు మన దేశంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూపీలోని కాన్పూర్‌లో తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. ఈ ఘర్షణలకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 1500 మందిపై కేసులు నమోదయ్యాయి. బీజేపీ నేత నుపుర్ శర్మ టీవీ డిబేట్‌లో వివాదాస్పద కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఢిల్లీ బీజేపీ మీడియా ఇంచార్జీగా సేవలు అందించిన నవీన్ కుమార్ జిందాల్ కూడా మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర ట్వీట్లు చేశారు. వీరిద్దరి వ్యాఖ్యలు ఆందోళనలు రేపాయి.
ఈ కామెంట్ల నేపథ్యంలోనే మన దేశంలోనే కాదు.. అరబ్ దేశాల్లోనూ తీవ్ర ఆగ్రహావేశాలు వెలువడ్డాయి. ఇండియా వస్తువులు, సినిమాలను బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్లు వచ్చాయి. ట్వి్ట్టర్‌లోనూ ట్రెండ్ అయ్యాయి. కాగా, ఖతర్ దేశం ఏకంగా భారత దౌత్య కార్యాలయానికి సమన్లు పంపింది. దీనికి సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేసిన వారిపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నారని, ఆ వ్యాఖ్యలు భారత ప్రభుత్వ అభిప్రాయాన్ని వెల్లడించదని, ప్రధాన స్రవంతికి వెలుపల ఉండే కొందరు ఆ ట్వీట్లు చేశారని భారత అంబాసిడర్ దీపక్ మిట్టల్ ఖతర్ అధికారులకు సమాధానం ఇచ్చారు.
ఖతర్ విదేశాంగ శాఖ ఆ దేశంలోని భారత అంబాసిడర్‌కు సమన్లు పంపింది. భారత్‌లో అధికార పార్టీకి చెందిన నేత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సమన్లు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల మంది ముస్లింలు మహమ్మద్ ప్రవక్త నిర్దేశంలో జీవిస్తున్నారని, ఆయన బోధనలను అనుసరిస్తున్నారని ఖతర్ పేర్కొంది. అలాంటి మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం అంటే.. మతపరమైన విద్వేషాన్ని రగల్చడమేనని తెలిపింది.
ఈ సమన్ల నేపథ్యంలో భారత అంబాసిడర్ ఖతర్ విదేశాంగ కార్యాలయ అధికారులతో సమావేశమై చర్చించినట్టు భారత దౌత్యవర్గాలు వివరించాయి. ఆ ట్వీట్లు భారత ప్రభుత్వ దృక్పథానికి వ్యతిరేకమైనవని స్పష్టం భారత దూత ఖతర్ అధికారులకు స్పష్టం చేశారు. అవి కొన్ని బాహ్య శక్తుల అభిప్రాయాలు అని పేర్కొన్నట్టు ఇండియా టుడే కథనం వివరించింది.
భారత నాగరికతలోనే భిన్నత్వంలో ఏకత్వం ఇమిడి ఉన్నదని భారత దౌత్య అధికారి వెల్లడించారు. అన్ని మతాలను భారత ప్రభుత్వం సమానంగా గౌరవిస్తుందని తెలిపారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్టు వివరించారు.
కాగా, మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై బీజేపీ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ ప్రతినిధి నుపుర్ శర్మను సస్పెండ్ చేయగా.. ఢిల్లీ బీజేపీ మీడియా ఇంచార్జీ నవీన్ కుమార్ జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది.
ఈ చర్యలను ఖతర్ ప్రభుత్వం స్వాగతించింది.
