కరోనా వైరస్ ఆధ్యాత్మిక రంగంపై పెను ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. నిత్యం ఆలయానికి వెళ్లి, పూజలు చేయనిదే పొద్దు పొడవని వారిని కోవిడ్ కట్టేసింది. దీంతో ఇల్లే దేవాయలమైంది.

అయితే దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో కేంద్రం నిదానంగా ఆంక్షలు ఎత్తేస్తోంది. ఈ క్రమంలో ఒడిశాలోని ప్రముఖ పూరి జగన్నాథుని ఆలయం దాదాపు 9 నెలల నుంచి తేరుకుంది. 

అయితే ఆలయంలోకి భక్తులను అనుమతించనున్న నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలను కఠినంగా అమలు పరుస్తామని ఆలయ అధికారులు తెలిపారు. మొదట స్థానిక భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు.

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి 1, 2 తేదీల్లో భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున ఆ రెండు రోజుల్లో ఆలయాన్ని మూసి ఉంచుతామన్నారు. ఆ రెండు రోజుల్లో కేవలం సేవకులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.

అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఎక్కువ సంఖ్యలో ఆలయ సేవకులు కరోనా బారిన పడుతున్నారు. అయితే భక్తుల, వివిధ పార్టీలు ఒత్తిడి తేవడంతో డిసెంబరు మూడో వారం నుంచి ఆలయాన్ని తెరుస్తామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

పూరి ఆలయం తెరుచుకోనున్న సమాచారాన్ని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ తన ట్విటర్‌ ఖాతాలో తెలిపారు. జగన్నాథుని సైకత శిల్పాన్ని పోస్టు చేసి భక్తులంతా నిబంధనలు పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని కోరారు.