ఒడిషాలోని ప్రఖ్యాత పూరి జగన్నాథ ఆలయాన్ని సుమారు 12 గంటల పాటు మూసివేశారు. అదేంటి ప్రస్తుతం సూర్య, చంద్ర గ్రహణాలు కూడా లేవు. ఎలాంటి శుద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు సమాచారం లేదు.. అటువంటప్పుడు ఉన్నపళంగా ఆలయం ఎందుకు మూసివేశారు అని మీకు సందేహాం కలగవచ్చు.

వివరాల్లోకి వెళితే.. గురువారం సాయంత్రం ఆలయంలో పూజారిగా విధులు నిర్వర్తిస్తున్న ఒకరు తన వెంట భక్తుడిని గర్భాలయంలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, సదరు భక్తుడు విదేశీయుడని భావించిన అక్కడి పోలీస్.. పూజారిని అడ్డుకున్నాడు.

దీంతో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటు చేసుకుంది.. ఈ క్రమంలో పోలీసు తనపై దాడి చేసినట్లు పూజారి ఆరోపించడంతో మిగిలిన పూజారులు విధులు బహిష్కరించడంతో పాటు వెంటనే గర్భాలయాన్ని మూసివేసి, ఆందోళనకు దిగారు.

అధికారులు ఆలస్యంగా రంగంలోకి దిగడంతో సుమారు 12 గంటల పాటు ఆలయం మూతపడింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సదరు పోలీస్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పూజారులు ఆందోళన విరమించారు.

గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం 4.30 గంటల వరకు గర్భాలయం మూసివేయడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నిరాశకు గురయ్యారు. మరోవైపు ఈ ఘటనపై పూరీ రాజవంశీకులు గజపతి మహరాజ్ రాజా దివ్యసింగ్ దేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ప్రాత:కాల కైంకర్యం నిలిచిపోవడం ఆలయ చరిత్రలోనే తొలిసారని ఆయన తెలిపారు.