పేదరికంతో మగ్గిపోతున్న ఓ కానిస్టేబుల్ క్షణాల్లో కోటీశ్వరుడు అయిపోయాడు.  తాను కోటీశ్వరుడు అయ్యాడన్న విషయం ఆయన నమ్మలేకపోయాడు. అతని కుటుంబసభ్యులైతే ఆనందంలో మునిగి తేలుతున్నారు. అదృష్టం అంటే ఇతనిదే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సంఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పంజాబ్ లోని హోషియార్ ప్రాంతానికి చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తి తొమ్మిదేళ్ల క్రితం పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా చేరాడు.  తనకు వచ్చే చాలీచాలని జీతంతోనే జీవనం సాగిస్తూ వస్తున్నాడు. కాగా... కొద్ది రోజుల క్రితం అశోక్ రూ.200 పెట్టి లాటరీ కొనుగోలు చేశాడు. అది గెలుస్తాననే ఆశ లేకపోవడంతో పోలీస్ స్టేషన్ లో పెట్టేశాడు.

తీరా ఓ రోజు తనకు పంజాబ్‌ ప్రభుత్వ లోహ్‌రీ బంపర్‌-2019 లాటరీ తగిలిందని, దాంట్లో మీరు రూ.రెండు కోట్లు గెలుచుకున్నారని సమాచారం అందింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాను నిర్లక్ష్యంగా పడేసిన టికెట్‌ వెతికి తీసుకొన్నారు. తన లాటరీ నెంబర్‌ను సరిపోల్చుకున్నారు. విజేత తనే అని ధ్రువీకరించుకొని ఎగిరి గంతేశారు.

తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయిన అశోక్‌.. ఇక తన కష్టాలన్నీ తీరిపోనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో అతనికి డబ్బు చేతికి అందేలా చేస్తామని అధికారులు చెబుతున్నారు.