ఓ పక్క తండ్రి రైతుల శ్రేయస్సు కోసం ఉద్యమం చేస్తుండగా.. ఆయన కుమారుడు దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన పంజాబ్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే..... తరన్ తరన్ జిల్లాకు చెందిన కుల్వంత్ సింగ్ కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ (22) రెండేళ్ల క్రితం భారత సైన్యంలో చేరాడు. చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని కలలుగన్న ఆయన ఎట్టకేలకు మిలటరీలో చేరాడు.

ప్రస్తుతం 18 జమ్మూకాశ్మీర్ రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సుఖ్‌బీర్ సింగ్ రాజౌరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహిస్తుండగా పాకిస్తాన్ దళాలు జరిపిన కాల్పుల్లో ఆయన అమరుడయ్యాడు.

కుల్వంత్‌కు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఇటీవలే సుఖ్‌బీర్‌ రూ. 5 లక్షలు అప్పు తీసుకుని, ఓ అక్కకు పెళ్లి చేశారు. ఆయన సోదరుడు మలేసియాలో కార్మికుడిగా పని చేస్తున్నారు.

తన ఆశలన్నీ సుఖ్‌బీర్ మీదే పెట్టుకున్నానని కుల్వంత్ చెప్పారు. ఇంతలోనే ఇలా జరగడంతో ఆయన కన్నీటి పర్యంతమవుతున్నారు. శుక్రవారం ఉదయం పంజాబ్ రైతులు నూతన వ్యవసాయ చట్టాలపై నిరసన తెలిపేందుకు ఢిల్లీ వెళ్లేందుకు కుల్వంత్ సిద్ధమవుతుండగా... సుఖ్‌బీర్ మరణవార్త ఆయనకు తెలియజేశారు అధికారులు.

ఇదిలావుండగా, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ సంఘటనపై స్పందించారు. సుఖ్‌బీర్ కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. కుటుంబంలోని ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.