భారతదేశంపై సెకండ్ వేవ్ గట్టిగానే ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ మూడు రాష్ట్రాల్లోనే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనే వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా వుంది. దీంతో ఆయా రాష్ట్రాలు కోవిడ్‌ను అడ్డుకోవడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. 

మరోవైపు పంజాబ్‌లోనూ వైరస్‌ ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది. రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో 80శాతం బ్రిటన్ రకానివే కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది.

రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో రాజకీయ సభలు, సమావేశాలపై నిషేధం విధించడంతో పాటు మాల్స్‌, మార్కెట్ల వంటి రద్దీ ప్రదేశాల్లో ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. 

భారతదేశంలో ప్రతినిత్యం కొత్తగా దాదాపు లక్ష కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే లక్షా 15వేల పాజిటివ్‌ కేసులు బయటపడటంతో కేంద్రం అప్రమత్తమైంది.

మహారాష్ట్రలో అత్యధికంగా 55 వేల కేసులు నమోదుకాగా, పంజాబ్‌లో 3వేల కేసులు బయటపడ్డాయి. అయితే, పంజాబ్‌లో యూకే స్ట్రెయిన్ కేసులు కావడంతో ఆ రాష్ట్రానికి అదనపు హెచ్చరికలు జారీ చేసింది.