పంజాబ్ ప్రభుత్వం 424 వీవీఐపీల సెక్యూరిటీ కుదింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ నెల 7వ తేదీ నుంచి కుదించిన సెక్యూరిటీని మళ్లీ పునరుద్ధరిస్తామని తెలిపింది. సెక్యూరిటీ తగ్గించడంతో మాజీ మంత్రి ఓపీ సోని హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో పంజాబ్ ప్రభుత్వం ఈ మేరకు తెలిపింది.
చండీగడ్: పంజాబీ సింగర్ సిద్దూ మూసే వాలా హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం వీవీఐపీలకు సెక్యూరిటీ స్థాయిలను తగ్గించిన రోజుల వ్యవధిలోనే సిద్దూ మూసే వాలా హత్య జరిగింది. దీంతో భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. తాజాగా, సెక్యూరిటీ స్థాయిలను కుదిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి పంజాబ్ ప్రభుత్వం రెడీ అయింది. జూన్ 7వ తేదీ నుంచి 424 వీవీఐపీల సెక్యూరిటీని యథాస్థాయికి పునరుద్ధరించనున్నట్టు వెల్లడించింది.
సెక్యూరిటీ వలయాన్ని తగ్గించిన 424 మంది వీఐపీల్లో మాజీ మంత్రి ఓపీ సోని కూడా ఉన్నారు. సెక్యూరిటీని తగ్గించడంపై ఆమె పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. తన సెక్యూరిటీ కవర్‌ను యథాస్థాయికి పెంచాలని డిమాండ్ చేస్తూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో ఆప్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. సెక్యూరిటీ స్థాయిలు తగ్గించిన వీఐపీలకు మళ్లీ గత స్థాయిల్లో సెక్యూరిటీ పెంచుతామని పంజాబ్ ప్రభుత్వం హైకోర్టులో పేర్కొంది.
మాజీ మంత్రి ఓపీ సోని దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వంపై ప్రశ్నలు కురిపించింది. అసలు సెక్యూరిటీ కవర్ ఎందుకు కుదించారని హైకోర్టు అడిగింది. ఇందుకు సమాధానంగా జూన్ 6వ తేదీ ఆపరేషన్ బ్లూ స్టార్ యానివర్సరీ ఉన్నదని, ఈ సమయంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే ముప్పు ఉన్నదని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. అందుకోసమే ప్రభుత్వానికి భద్రతా సిబ్బంది అవసరం పడిందని వివరించింది. ఈ కారణంగానే కొంతమంది వీవీఐపీల సెక్యూరిటీ కవర్‌ను కుదించి భద్రతా సిబ్బందిని పోగుచేసుకునే ప్రయత్నం చేసినట్టు పేర్కొంది.
పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం గత నెలలో 424 వీవీఐపీలకు సెక్యూరిటీ కవర్‌ను కుదిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 424 మంది వీఐపీలకు తక్షణమే సెక్యూరిటీ కవర్‌ను కుదిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. వీరందరికీ సెక్యూరిటీగా ఉన్న రక్షణ సిబ్బంది వెంటనే జలందర్ కంటోన్మెంట్‌లో ప్రత్యేక డీజీపీకి రిపోర్ట్ చేయాలని శనివారం ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ పోలీసు అధికారులు, ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నేతలు సహా పలువురు సెక్యూరిటీ కవర్ ఈ ఆదేశాలతో రద్దు అయ్యాయి. మొత్తం మూడు దఫాలుగా సెక్యూరిటీ రద్దు నిర్ణయాన్ని పంజాబ్ ప్రభుత్వం అమలు చేసింది.
ఈ నెల తొలినాళ్లలో భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం తొలుత ఎనిమిది మందికి సెక్యూరిటీని రద్దు చేసింది. ఇందులో కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్; బీజేపీ నేత సునీల్ జాఖడ్‌లు ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో ఐదుగురికి జెడ్ సెక్యూరిటీ లెవెల్ ఉంది. మిగతా ముగ్గురికి వై ప్లస్ గ్రూప్ సెక్యూరిటీ ఉంది. ఈ ఎనిమిది మందిని 127 మంది పోలీసు అధికారులు గార్డ్ చేశారు. తొమ్మిది పోలీసు వాహనాలు వీరి రక్షణ కోసం పని చేశాయి.
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, లోక్ సభ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, మాజీ కాంగ్రెస్ ఎంపీ సునీల్ జాఖడ్, కేంద్ర మాజీ క్యాబినెట్ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాలు సెక్యూరిటీ కవర్ ఎత్తేసిన జాబితాలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు పర్మింద్ సింగ్ పింకీ, రాజిందర్ కౌర్ భట్టాల్, నవతేజ్ సింగ్ చీమ, కేవాల్ సింగ్ ధిల్లియన్‌లు ఈ లిస్టులో ఉన్నారు.
