ప్రభుత్వ ఉద్యోగులకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉద్యోగులకు అక్టోబర్ నెల జీతం రెట్టింపు చేసింది. అయితే.. అది నిజంగా ఉద్యోగులను సంతోషపెట్టాలని ప్రభుత్వం చేసిన పని కాదట. పొరపాటున అలా జరిగిందని తర్వాత తెలసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రప్రభుత్వం తమకు దీపావళి బహుమతిగా డబుల్ జీతం తమ ఖాతాల్లో వేసిందని ఉద్యోగులు సంబరపడ్డారు. అయితే.. తాము పొరపాటున డబుల్ జీతం ఖాతాల్లో వేశామని, అదనపు డబ్బును ఖాతాల్లోనుంచి డ్రా చేయవద్దని ప్రభుత్వ ట్రెజరీ ఉన్నతాధికారుల ప్రకటనతో ఉద్యోగుల సంతోషం ఆవిరైంది. 

తాను పొరపాటున అక్టోబరు నెల జీతం డబుల్ వేశామని, దీన్ని తిరిగి వెనక్కి తీసుకుంటామని జిల్లా ట్రెజరీ అధికారి ఏకే మైనీ అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులకు నోటీసు జారీ చేశారు. సాంకేతిక లోపం వల్లనే ఈ పొరపాటు జరిగిందని ట్రెజరీ అధికారి వివరణ ఇచ్చారు. ఒక్క అమృత్ సర్ జిల్లాలోనే 50 కోట్ల రూపాయలు అదనంగా ఉద్యోగులకు చెల్లించారని తేలింది. దీంతో అధికంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి తీసుకునే పనిలో ట్రెజరీ అధికారులు మునిగారు.