చంఢీఘడ్:కరోనా నేపథ్యంలో  రాత్రిపూట కర్ఫ్యూతో పాటు వీకేండ్‌లో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయాలని  పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.రాష్ట్రంలో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుండి తెల్లవారుజాము ఐదు గంటలవరకు నైట్ కర్ఫ్యూ ఉంటుందని సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. ప్రతి శుక్రవారం నాడు సాయంత్ర 6 గంటల నుండి సోమవారం నాడు ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ ఉంటుందని ఆయన ప్రకటించారు.

 


పంజాబ్ మంత్రివర్గ సమావేశంలో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకొన్నామని సీఎం తెలిపారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని ఆయన ప్రజలను కోరారు. రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ ను సరఫరా చేయాలని  సీఎం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కు సోమవారం నాడు లేఖ రాశారు.సీఎం అమరీందర్ సింగ్ వినతికి భారత సైన్యం వెస్ట్రన్ కమాండ్ సోమవారం నాడు స్పందించింది. వైద్య పరంగా శిక్షణ పొందిన వారితో పాటు ఇతర సేవలను అందిస్తామని ప్రకటించింది. ఆదివారం నాడు  రాష్ట్రంలో 7 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.