Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు షాకిచ్చిన మాజీ సీఎం.. పార్టీ వీడతారని ప్రకటన.. ఆ పార్టీలో చేరనని క్లారిటీ

పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌ను వీడుతానని స్పష్టం చేశారు. అయితే, బీజేపీలో చేరబోనని చెప్పారు. ఇప్పటి వరకు తాను కాంగ్రెస్‌లోనే ఉన్నారని, కానీ, ఇకపై కొనసాగబోరని వివరించారు. పార్టీ తనతో సరిగా వ్యవహరించలేదని ఆయన అన్నారు. ఢిల్లీ పర్యటన చేసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లతో భేటీ అయ్యారు. కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశానికి ప్రయత్నించకపోవడం గమనార్హం.
 

punjab former CM captain amarinder singh to quit congress
Author
Chandigarh, First Published Sep 30, 2021, 2:25 PM IST

చండీగడ్: పంజాబ్(Punjab) మాజీ సీఎం(Former CM), కాంగ్రెస్(Congress) సీనియర్ నేత అమరీందర్ సింగ్(Amarinder Singh) ఆ పార్టీకి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టు వెల్లడించారు. ‘ఇప్పటి వరకు నేను కాంగ్రెస్‌లో ఉన్నాను. కానీ, ఇకపై కాంగ్రెస్‌లో కొనసాగను(Quit). పార్టీలో నాతో ఈ విధంగా వ్యవహరించి ఉండాల్సింది కాదు’ అని అన్నారు. అయితే, బీజేపీ(BJP)లోనూ చేరబోనని క్లారిటీనిచ్చారు. పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేసినప్పటి నుంచి అనేక వాదనలు ప్రచారంలోకి వచ్చాయి. తాను కాంగ్రెస్ నుంచి వైదొలిగి బీజేపీలో చేరనున్నట్టు రాజకీయవర్గాలు భావించాయి.

ఢిల్లీకి వెళ్లిన కెప్టెన్ అమరీందర్ సింగ్ నిన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఇవాళ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌‌తో భేటీ అయ్యారు. ఆయన బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం సాగుతున్న తరుణంలో అమిత్ షాతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖరారైందన్న విశ్లేషణలు వచ్చాయి. కానీ, ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశానికి ప్రయత్నించలేదు.

పంజాబ్ సీఎంగా రాజీనామా చేయగానే ఆయన బీజేపీలో చేరాలని హర్యానా మంత్రి అనిల్ విజ్ సహా పలువురు బీజేపీ నేతలు సూచనలు చేశారు. ఆహ్వానం పలికారు. కానీ, వాటిపై కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించలేదు. తాజాగా, ఆ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ తాను పార్టీలో కొనసాగబోరని స్పష్టం చేశారు. అలాగే, బీజేపీలోనూ చేరబోనని చెప్పారు. పార్టీ వీడతారన్న ప్రచారం రాగానే కాంగ్రెస్ సీనియర్ నేతలు అంబికా సోని, కమల్ నాథ్‌లు కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో సమావేశమై ఆయన నిర్ణయాలను సమీక్షించుకోవడానికి ప్రయత్నించినట్టు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios