Asianet News TeluguAsianet News Telugu

బీజేపీలో చేరనున్న మాజీ సీఎం?.. జేపీ నడ్డా, అమిత్ షాలతో నేడు ఢిల్లీలో భేటీ

కాంగ్రెస్‌కు మరో ఝలక్ తగలనుంది. ఇటీవలే పంజాబ్ సీఎంగా రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసమే ఆయన ఢిల్లీ పర్యటించనున్నట్టు తెలిసింది. నేడు ఢిల్లీలో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం అక్కడే బీజేపీ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం.

punjab former CM captain amarinder singh likely to join bjp after meeting with nadda, shah
Author
New Delhi, First Published Sep 28, 2021, 2:21 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. గోవా మాజీ సీఎం, సీనియర్ నేత నిన్ననే ఎమ్మెల్యేకు, పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చిన విషయం మరువకముందే మరో మాజీ సీఎం ఝలక్ ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. పంజాబ్ సీఎంగా ఇటీవలే రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నట్టు సమాచారం అందింది. ఆయన నేడు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో సమావేశం కాబోతున్నట్టు తెలిసింది. ఈ సమావేశానంతరం ఇదే రోజు సాయంత్రం బీజేపీ కండువా కప్పుకోనున్నట్టు రాజకీయవర్గాలు తెలిపాయి.

మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ఆయన బీజేపీలో చేరే అవకాశముందని తెలుస్తున్నది. ఆయన చేరిన తర్వాత కేంద్ర మంత్రిమండలిలోనూ చోటు దక్కే అవకాశమున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వానికి ఏడాది పాటు రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. ముఖ్యంగా పంజాబ్ కేంద్రంగా రైతు సంఘాలు కేంద్రానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరితే ఆయనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశమున్నది సమాచారం.

ఒకవేళ బీజేపీలో చేరకున్నా ఆయనను కమలం పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. పంజాబ్ నుంచి బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న శిరోమణి అకాలీదళ్ ఇటీవలే ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కెప్టెన్ అమరీందర్ సింగ్‌‌ను తమకు అనుకూలంగా వినియోగించే అవకాశమున్నదని వాదనలు వినిపిస్తున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరకుంటే స్వతంత్రంగా పంజాబ్‌లో ఒక పార్టీ స్థాపించడానికి కేంద్రంలోని బీజేపీ సహకరించే అవకాశముంది. తద్వార పరోక్షంగా పంజాబ్‌లో పట్టు కలిగి ఉండాలని భావిస్తున్నది.

సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయగానే బీజేపీ నేతలు ఆయనను పార్టీలోకి ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే. హర్యానా మంత్రి అనిల్ విజ్, కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే కూడా ఆయనను బీజేపీలోకి చేరాలని సూచనలు చేశారు. కానీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ మాత్రం తన రాజీనామా తర్వాత ఎలాంటి ప్రకటన చేయలేదు. చాలా వరకు మౌనంగా ఉన్నారు. పార్టీ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే రాజీనామా చేసిన విషయం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios