పంజాబ్‌కు చెందిన ఓ రైతు రెండేళ్లు కష్టపడి రూ. 1.5 కోట్లు వెచ్చించి తన కలల ఇంటిని నిర్మించుకున్నాడు. కానీ, అటువైపుగా ఎక్స్‌ప్రెస్ వే వస్తున్నదని, ఆ ఇంటిని కూల్చేయాలని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. అందుకోసం పరిహారం కూడా ఇస్తామని చెప్పింది. ఆ రైతు తన కలలను కూల్చుకోలేదు. ఇంటిని 500 అడుగులు జరపుతున్నాడు.
న్యూఢిల్లీ: సొంత ఇల్లు నిర్మించుకోవాలని ఏళ్ల తరబడి కలలు కంటారు. ఆ కలల సౌధాన్ని నిర్మించుకోవడానికి అహర్నిశలు కష్టపడతారు. అన్ని విషయాల్లోనూ స్పష్టత వచ్చిన తర్వాతే నిర్మాణాన్ని మొదలు పెడతారు. అలాగే, పంజాబ్‌కు చెందిన ఓ రైతు తన కలల ఇంటిని రూ. 1.5 కోట్లు పెట్టి నిర్మించుకున్నాడు. కానీ, ప్రభుత్వం చేపడుతున్న రోడ్ల ప్రాజెక్టు ఆ రైతు కలలకు పెద్ద పరీక్షే పెట్టింది. ఓ ఎక్స్‌ప్రెస్ వే అటు వైపుగా రానుంది. అంటే.. ఆ ఇంటిని అక్కడి నుంచి తొలగించాల్సి వచ్చింది. ఆ ఇల్లు కూల్చేస్తే ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆ రైతుకు తెలిపింది. ఆ ఇంటిని కూలుస్తున్నందుకు నష్టపరిహారం కూడా అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, రెండేళ్లపాటు శ్రమించి కట్టుకున్న తన కలల ఇంటిని కూల్చడం ఆయన వల్ల కాలేదు. అందుకే తన ఇంటిని కాపాడుకోవడానికి ఎన్నో ఆలోచనలు చేశాడు. ఎంతో మందిని కలిశాడు. మరెన్నో టెక్నాలజీల గురించి తెలుసుకున్నాడు. చివరకు ఓ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయమే ఇప్పుడు తన ఇంటి గురించి దేశం అంతా మాట్లాడుకునేలా చేసింది.
పంజాబ్‌లోని సంగ్రూర్‌లో రోషన్‌వాలా గ్రామ రైతు సుఖ్విందర్ సింగ్ సుఖి. ఆయన తన పంట పొలాల్లో తన డ్రీమ్ హౌజ్ నిర్మించుకున్నాడు. కానీ, ఢిల్లీ, అమృత్ సర్ కాట్రా ఎక్స్‌ప్రెస్ వే ఆ ఇంటి గుండా వెళ్లాల్సి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారత్ మాలా ప్రాజెక్టులో భాగంగా ఈ ఎక్స్‌ప్రెస్ వే ను నిర్మిస్తున్నారు. ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, దీని ద్వారా సమయం, ఇంధనం, డబ్బులు ఆదా చేయడమే లక్ష్యంగా ఉన్నది. ఢిల్లీ నుంచి జమ్ము కశ్మీర్‌కు పంజాబ్ గుండా వెళ్లే షార్ట్ డిస్టెన్స్ రోడ్ ఇది అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.
కాబట్టి, ఆ రెండు అంతస్తుల ఇంటిని కూల్చేయాల్సిందిగా పంజాబ్ ప్రభుత్వం ఆ రైతుకు నోటీసు ఇచ్చింది. కూల్చిన ఇంటికి పరిహారం కూడా ఇస్తామని తెలిపింది. సుఖ్వింద్ సింగ్ సుఖి ఈ నోటీసుతో ఖంగుతిన్నాడు. రెండేళ్లుగా తన కలల సౌధాన్ని నిర్మించుకున్న సుఖ్వింద్ సింగ్ సుఖి తన మైండ్ మార్చుకున్నాడు. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో మరో ఇల్లు నిర్మించడం తన వల్ల కాదని అనుకున్నాడు. తను ఎంతో ఇష్టంగా, ప్రేమగా నిర్మించుకున్న ఇంటిని ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు.
ఇందుకోసం తన ఇంటిని కూల్చకుండానే అక్కడి నుంచి తొలగించాలని అనుకున్నాడు. ఇంటి లొకేషన్‌ను 500 అడుగులు మార్చాలని ఫిక్స్ అయ్యాడు. అంటే.. తన కలల ఇంటిని ఉన్న చోటు నుంచి 500 అడుగుల దూరానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం నిపుణులతో మాట్లాడాడు. అంతా సిద్ధం చేసుకున్నాడు. తన ఇంటిని 500 అడుగుల దూరానికి కదల్చే బృహత్కార్కానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పటి వరకు సుమారు 250 అడుగుల దూరం వరకు తన ఇంటిని కదిల్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
