Punjab Assembly Election 2022: పంజాబ్ లో ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్ది రాష్ట్ర రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ పఠాన్ కోట్ ర్యాలీలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌కు జిరాక్స్ కాపీ అని ఆరోపించారు.
Punjab Assembly Election 2022: ఈ నెలలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని ప్రధానపార్టీలు పంజాబ్ లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. అయితే, ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ... అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పఠాన్ కోట్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీని కాంగ్రెస్ జిరాక్స్ కాపీ అంటూ ఆరోపించారు.
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఎన్నికల (Punjab Assembly Election 2022) ర్యాలీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు లాభసాటిగా మారుతాయని అన్నారు. "మీకు సేవ చేయడానికి నాకు ఐదేళ్లు సమయం ఇవ్వండి. వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు లాభసాటిగా మారుతాయని నేను మీకు హామీ ఇస్తున్నాను" అని పఠాన్‌కోట్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ అన్నారు. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శల దాడిని కొనసాగిస్తూ.. "మేము పంజాబ్‌ను పంజాబియాట్ కోణం నుండి చూస్తాము, ఇది మా ప్రాధాన్యత, ప్రత్యర్థులు పంజాబ్‌ను రాజకీయ ప్రిజం ( political prism) ద్వారా మాత్రమే చూస్తారు" అని అన్నారు.
అలాగే, సంత్ రవిదాస్‌ను గురించి కూడా ప్రధాని మోడీ ప్రస్తావించారు. ఆయన ఆశయాలను తమ ప్రభుత్వం అనుసరిస్తోందని, పేదల సంక్షేమమే అన్నింటికంటే ఉన్నతమని అన్నారు. రవిదాస్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని 'శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్' వద్ద ప్రార్థనలు చేసిన అనంతరం ర్యాలీలో పాల్గొనేందుకు ప్రధాని పఠాన్ కోట్ కు వచ్చారు. "ఈరోజు సంత్ రవిదాస్ జయంతి. ఇక్కడికి రాకముందు, నేను గురు రవిదాస్ విశ్రామ్ మందిర్ (ఢిల్లీలో) వెళ్లి ఆశీర్వాదం పొందాను" అని మోడీ (Prime Minister Narendra Modi) చెప్పారు.
విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ సిక్కుల మనోభావాలను పట్టించుకోలేదని మోడీ ఆరోపించారు. పాకిస్థాన్ లో ఉన్న గురు నానక్ నిర్యాణ స్థలం కర్తార్‌పూర్ సాహిబ్‌ను ఇండియా భూభాగంలోకి వచ్చేలా కాంగ్రెస్ చర్యలు తీసుకోలేకపోయిందని విమర్శించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రజలకు ఏం చేయలేదని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్‌పై ఆధారాలు అడుగుతున్నదని కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ఈ సారి ప్రజలకు అవకాశం ఇవ్వాలని Prime Minister Narendra Modi కోరారు. కాగా, పంజాబ్ లో ఈ నెల 20 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ 77 సీట్లు గెలుపొంది.. సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 117 మంది సభ్యుల పంజాబ్ శాసనసభలో ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాలను గెలుచుకుని రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) 15 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది, బీజేపీ 3 సీట్లు సాధించింది.
