Punjab Assembly Election 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్, పంజాబ్‌, మ‌ణిపూర్‌, గోవా రాష్ట్రాల్లో  ఈ నెల‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ ప‌డుతుండ‌టంతో నామినేష‌న్లప‌ర్వం కొన‌సాగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో పంజాబ్ ముఖ్య‌మంత్రి చ‌ర‌ణ్ జీత్ సింగ్ చ‌న్నీ మంగ‌ళ‌వారం నాడు చామ్‌కౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో నామినేష‌న్ దాఖ‌లు చేశారు.  

Punjab Assembly Election 2022: ఫిబ్ర‌వ‌రిలో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు వేడెక్కాయి. ఈ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అన్ని ప్ర‌ధానపార్టీలు పంజాబ్ లో ఎన్నిక‌ల ప్రచారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతుండ‌టంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. అయితే, ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో నామినేష‌న్ల ప‌ర్వం కొన‌సాగుతున్న‌ది. ఈ క్ర‌మంలోనే మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింగ్ సిద్ధూ అమృత్‌సర్‌లో శ‌నివారం నాడు నామినేషన్‌ వేశారు. ఇక మంగ‌ళ‌వారం నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి చ‌ర‌ణ్ జీత్ సింగ్ చ‌న్నీ (Charanjit Singh Channi)సైతం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. 

పంజాబ్ ముఖ్య‌మంత్రి చ‌ర‌ణ్ జీత్ సింగ్ చ‌న్నీ మంగ‌ళ‌వారం నాడు చామ్‌కౌర్ సాహిబ్ (Sri Chamkaur Sahib constituency) అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు, త‌న ముఖ్య అనుచ‌రుల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌ రిట‌ర్నింగ్ కార్యాల‌యానికి నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డానికి ఆయ‌న వెళ్లారు. అక్క‌డున్న రిట‌ర్నింగ్ అధికారికి అధికారికి త‌న నామినేష‌న్ ప‌త్రాలు చ‌ర‌ణ్ జీత్ సింగ్ చ‌న్నీ(Charanjit Singh Channi) స‌మ‌ర్పించారు. కాగా, చ‌న్నీ ఈ సారి రాష్ట్రంలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు. అందులో ఒక‌టి శ్రీ చామ్‌కౌర్ సాహిబ్ స్థానం కాగా, రెండోది భ‌దౌర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం. ఇప్ప‌టికే భ‌దౌర్‌లో చ‌న్నీ నామినేష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. సోమ‌వారం నాడు భ‌దౌర్ లో నామినేష‌న్ వేయ‌గా, మంగ‌ళ‌వారం నాడు శ్రీ చామ్‌కౌర్ సాహిబ్ స్థానికి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. 

కాగా, పంజాబ్ ఎన్నిక‌ల్లో ఈ సారి బ‌హుముఖ పోరు ఉండునుంద‌ని ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు పేర్కొంటున్నాయి. ఎలాగైనా పంజాబ్ అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. గ‌త ఎన్నిక‌లో మంచి ఫ‌లితాలు రాబ‌ట్టి ఆప్ ఈ సారి సీఎం పీఠం ద‌క్కించుకోవానికి త‌న‌దైన రీతిలో ప్ర‌చారం కొన‌సాగిస్తున్న‌ది. ఇటీవ‌లే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి అమ‌రీంద్ సింగ్ (amarinder singh) కొత్త పార్టీ పెట్టారు. అధికారం కైవ‌సం చేసుకోవ‌డానికి బీజేపీ (BJP) తో క‌లిపి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు. ఇక రాష్ట్రంలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ మ‌ళ్లీ అధికారం ద‌క్కించుకోవ‌డానికి అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు, ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్నది. కాంగ్రెస్ నేత‌లు న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ (Navjot Sidhu), సీఎం చ‌న్నీలు ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు.

కాగా, పంజాబ్ లో ఈ నెల 20న అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగ‌నుంది. మార్చి 10న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డికానున్నాయి. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ 77 సీట్లు గెలుపొంది.. సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంది. 117 మంది సభ్యుల పంజాబ్ శాసనసభలో ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాలను గెలుచుకుని రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) 15 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది, బీజేపీ 3 సీట్లు సాధించింది.