పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను వెనక్కి నెట్టేసి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే ఇది ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కాదని, ఇది సామాన్యుడి విజయం అని ఆ పార్టీ నేత మనీష్ సిసోడియా అన్నారు. 

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. అధికారం చేప‌ట్టేందుకు కావాల్సిన స్ప‌ష్ట‌మైన మెజారిటిని ఆప్ ఎప్పుడో దాటేసింది. దీంతో ఒక ఆ పార్టీ పంజాబ్ లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం లాంఛ‌న‌మే కానుంది. పంజాబ్ క్లీన్ స్వీప్ పై ఆమ్ ఆద్మీ పార్టీనేత మ‌నీష్ సిసోడియా స్పందించారు. ఇది సామాన్యుల విజ‌యం అని తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ పాల‌న ఇప్పుడు జాతీయ స్థాయిలో స్థాపించ‌బ‌డింద‌ని అన్నారు. కేజ్రీవాల్ న‌మూనాకు పంజాబ్ ఒక అవ‌కాశం ఇచ్చింద‌ని తెలిపారు. 

ఎన్నిక‌ల ఫ‌లితాల విష‌యంలో మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. “ మేము గోవా, ఉత్తరాఖండ్,  యూపీలో అభ్యర్థులను నిలబెట్టాము. కానీ పంజాబ్ పై ఎక్కువ‌గా దృష్టి పెట్టాము. క్రమంగా మిగిలిన రాష్ట్రాల్లోని ప్రజలు కూడా మా పార్టీని నమ్మడం ప్రారంభిస్తారు. బాబా సాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ లు కోరుకున్న విధంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే మంచి ఉద్దేశ్యంతో మేము ప్రాథమిక సౌకర్యాలు, పాఠశాలలు, వైద్యం, ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నాం.’’ అని ఆయ‌న తెలిపారు.

‘‘ మేము ఢిల్లీలో అందించిన మంచి పాలనే మాకు మళ్లీ అధికారాన్ని కట్టబెట్టింది. ఇప్పుడు పంజాబ్ లో కూడా అలాంటి పాలనే అందిస్తాం. ఢిల్లీ, పంజాబ్‌లలో మేము చేసే పనిని గమనించండి. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ విజ‌యం కాదు ‘ఆమ్ ఆద్మీ’ (సామాన్యుడు) విజయం ’’ అని మనీష్ సిసోడియా తెలిపారు. 

ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఎస్ఏడీ పితామ‌హుడు ప్రకాష్ సింగ్ బాదల్, మాజీ సీఎం అమరీందర్ సింగ్, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సీనియర్ నాయకులు పంజాబ్‌లోని తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు. అంతేకాకుండా శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్, మాజీ ముఖ్యమంత్రి రాజిందర్ కౌర్ భట్టల్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ పర్తాప్ సింగ్ బజ్వా, SAD నాయకుడు బిక్రమ్ సింగ్ మజిథియా, కేంద్ర మాజీ మంత్రి విజయ్ సంప్లా కూడా తమ సమీప ప్రత్యర్థుల వెనుక ఉన్నారు.

పంజాబ్‌లోని 117 స్థానాల్లో 88 స్థానాల్లో ఆధిక్యంతో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్‌స్వీప్‌ దిశగా సాగుతోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఐదుసార్లు సీఎంగా ప‌ని చేసిన పనిచేసిన ప్రకాష్ సింగ్ బాదల్ తన సొంతగడ్డి లాంబి నుండి తిరిగి ఎన్నికవ్వాలని ఆశిస్తున్నారు. అయితే తన సమీప ఆప్ ప్రత్యర్థి గుర్మీత్ సింగ్ ఖుడియాన్ కంటే 4,385 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. 94 ఏళ్ల వయసులో, ఎన్నికల్లో పోటీ చేసిన బాదల్ దేశంలోనే అత్యంత వయోవృద్ధుడు. 

ప్ర‌స్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ పోటీ చేసిన చమ్‌కౌర్ సాహిబ్ మరియు బదౌర్ రెండు స్థానాల నుండి వెనుకబడి ఉన్నారు. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన మాల్వా ప్రాంతంలో భాగమైన బదౌర్ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి లబ్ సింగ్ ఉగోకే ఆధిక్యంలో ఉన్నారు. చన్నీ మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన తన సొంత నియోజకవర్గం చమ్‌కౌర్ సాహిబ్ నుండి కూడా వెనుకబడి ఉన్నారు. చమ్‌కౌర్ సాహిబ్ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ 1,438 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.