కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరికి మద్ధతుగా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్ధతు లభిస్తోంది.

ఈ క్రమంలో రైతులకు సపోర్ట్‌ చేస్తూ పంజాబ్ జైళ్ల శాఖ డీఐజీ లఖ్మీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను ప్రభుత్వానికి సమర్పించినట్లు ఆయన తెలిపారు. రైతులకు మద్దతుగా నిలబడాలనే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు లఖ్మీందర్ తెలిపారు. 

మరోవైపు కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. రహదారుల నిర్బంధానికి పిలుపునిచ్చిన రైతు సంఘాలు నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

ఆదివారం జైపూర్-ఢిల్లీ రహదారిని నిర్బంధించడానికి ట్రాక్టర్లతో సిద్ధమయ్యారు. మూడు చట్టాలను పూర్తిగా రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు.