పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనళ్లుడు భూపేంద్ర సింగ్ హనీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం రాత్రి అరెస్ట్ చేసింది. సరిగ్గా రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఈ అరెస్టు జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పంజాబ్ ఎన్నికల కు కొన్ని రోజుల ముందు రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాల కేసులో పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ (Punjab Cm Charanjit Singh Channi) మేనళ్లుడు భూపేంద్ర సింగ్ హనీని (bhupendra singh honey) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ (arrest) చేసింది. హనీని గురువారం రాత్రి కస్టడీలోకి తీసుకున్న ఈడీ నేడు సీబీఐ (cbi) కోర్టులో హాజరుపరచనుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (pmla) నిబంధనల కింద హనీని అర్థరాత్రి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
పంజాబ్ (punjab) లో ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరిగాయంటూ గత నెలలో భూపేంద్ర సింగ్ హనీ ఇంటి ఈడీ దాడి చేసింది. ఈ దాడిలో దర్యాప్తు సంస్థ రూ. 8 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఈ సోదాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు, ఆస్తులకు సంబంధించిన లావాదేవీలు, మొబైల్ ఫోన్లు, రూ. 21 లక్షలకు పైగా విలువైన బంగారం, రూ. 12 లక్షల విలువైన రోలెక్స్ వాచ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. .
117 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీకి కొన్ని రోజుల ముందు ఈ అరెస్టు జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ అసెంబ్లీకి ఒకే దశలో ఫిబ్రవరి 20వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
గత కొన్ని రోజులుగా పంజాబ్ లో ఇసుక అక్రమ తవ్వకాలపై చర్చ జరుగుతోంది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ (ex cm amareendar singh) ఈ వ్యవహారంపై ఆరోపణలు చేశారు. ఇసుక తవ్వకాల్లో అవినీతి జరిగిందని, ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని స్థాయిల నాయకులకు హస్తం ఉందని ఆయన చెబుతున్నారు. ఈ విషయంపై గతంలో తాను సోనియా గాంధీ (sonia gandhi)కి ఫిర్యాదు చేశానని తెలిపారు. అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబుతున్నారని సోనియా గాంధీ తనను అడిగారని, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రక్షాళన చేసుకుంటూ రావాలని తాను బదులిచ్చానని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానంతో తాను ఎలాంటి చర్యలకు పూనుకోలేదని గతంలో ఒక సారి అమరీందర్ సింగ్ తెలిపారు. ఇందులో ప్రస్తుతం సీఎం చన్నీకి, ఇతర మంత్రులకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు.
