పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రేపు పెళ్లి చేసుకోబోతున్నారు. ఛండీగడ్‌లో ఆయన నిరాడంబరంగా, వైభవాలకు దూరంగా డాక్టర్ గుర్‌ప్రీత్ కౌర్‌ను మనువాడబోతున్నాడు. మాన్ తన మొదటి భార్యకు ఆరేళ్ల క్రితమే విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రేపు వివాహం చేసుకోబోతున్నారు. రాజధాని చండీగడ్‌లో మరోసారి ఆయన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. వధువు సంగ్రూర్‌కు చెందిన డాక్టర్ గుర్‌ప్రీత్ కౌర్. 48 ఏళ్ల భగవంత్ మాన్ రేపు డాక్టర్ గుర్‌ప్రీత్ కౌర్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ వేడుకను నిరాడంబరంగా జరుపుకోనున్నట్టు జాతీయ మీడియా సంస్థ ఏబీపీ ఓ కథనంలో పేర్కొంది. అయితే, ముఖ్య అతిథిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాాజరు కాబోతున్నారు.

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన మొదటి భార్య ఇందర్జిత్ కౌర్‌కు ఆరు సంవత్సరాల క్రితమే విడాకులు ఇచ్చారు. 2015లో వీరిద్దరూ మ్యూచువల్ డివోర్స్ ఫైల్ చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం భగవంత్ సింగ్ మాన్ మొదటి భార్య ఆ ఇద్దరి పిల్లలతో అమెరికాలో ఉంటున్నారు. పంజాబ్ సీఎంగా భగవంత్ సింగ్ మాన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు పిల్లలూ కార్యక్రమానికి హాజరయ్యారు.

తన మొదటి భార్యతో విడివడి రాజకీయాల్లో ఫుల్ బిజీగా మారిన భగవంత్ మాన్‌ను మళ్లీ ఇంటి వాడిని చేయాలని ఆయన తల్లి, సోదరి పట్టుపట్టినట్టు తెలుస్తున్నది. పట్టుపట్టి భగవంత్ మాన్‌ను ఒప్పించడమే కాదు.. వారే వధువును వెతికి పెట్టినట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భగవంత్ మాన్ తల్లి డాక్టర్ గుర్‌ప్రీత్ కౌర్‌‌ను తన కోడలిగా డిసైడ్ చేసినట్టు వివరించాయి. 

ఆడంబరాలకు దూరంగా జరుగుతున్న ఈ పెళ్లి కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా హాజరుకాబోతున్నట్టు తెలిసింది. ఈ వేడుక కోసం భగవంత్ సింగ్ మాన్ తల్లి ఇప్పటికే స్వగ్రామం సతోజ్ వదిలి సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నాారు.

భగవంత్ మాన్ తన జీవితంలో ఎన్నో మలుపులు ఎదుర్కొన్నారు. ఆయన తన కెరీర్‌ను స్టాండప్ కమెడియన్‌గా ప్రారంభించారు. తాగుబోతుగా పేరేసుకున్నారు. కమెడియన్‌గా స్టార్‌డమ్ అనుభవిస్తున్నప్పుడు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పార్లమెంటుకు ఎన్నికయ్యారు. లోక్‌సభకూ ఒక్కోసారి మత్తులో తూగుతూ వెళ్లేవాడని సహ చట్టసభ్యులు ఆరోపణలు చేసేవారు. అంతేనా.. ఈ మత్తులోలకుడికి భగవంత్ మన్‌కు బదులు పెగ్‌వంత్ మన్‌గానూ పేరు పెట్టారు. అలాంటి వ్యక్తి మద్యం వదిలి వ్యక్తిగత జీవితం, విలాసాలను పక్కనపెట్టి ప్రజా జీవితానికి అంకితం కావాలని ఫిక్స్ అయ్యారు. ఆప్‌ ఆయనను చేరదీసింది. ఇప్పుడు ఆయన పంజాబ్ సీఎం కుర్చీనే అధిరోహించారు. అయితే, ఎన్నో ఆటుపోట్లు, అగచాట్లు ఎదుర్కొన్న భగవంత్ మాన్ కేవలం రాజకీయ జీవితాన్నే కాదు.. వ్యక్తిగత జీవితాన్నీ ఇప్పుడు చక్కదిద్దుకుంటున్నారు.