పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో 10 మంది ఎమ్మెల్యేలు కేబినేట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మంత్రుల్లో అత్యధిక శాతం ఉన్నత విద్యావంతులే ఉన్నారు. ఇందులో పలువురు డాక్టర్లు, లాయర్లు కూడా ఉన్నారు. 

పంజాబ్‌లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు భగవంత్ మాన్ నేతృత్వంలోని కేబినేట్ లో శ‌నివారం చేరారు. ఉదయం 11 గంటలకు ఈ వేడుక ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం భగవంత్ మాన్ కూతురు సీరత్ కౌర్ మాన్, కుమారుడు దిల్షన్ మాన్ కూడా హాజరయ్యారు. ఈ ఎమ్మెల్యేల‌తో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ గోప్యతా ప్రమాణం చేయించారు.

మొట్ట మొద‌ట‌గా దిర్బా అసెంబ్లీ నియోజ‌వ‌క‌ర్గం నుంచి రెండోసారి ఆప్ ఎమ్మెల్యేగా ఎన్నికైన 48 ఏళ్ల హర్పాల్ సింగ్ చీమా మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఆయ‌న న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశార్. ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయ‌న కీల‌క నేత‌గా ఉన్నారు. ప్ర‌స్తుత భ‌గ‌వంత్ మాన్ క్యాబినెట్‌లోని ఇద్దరు డాక్ట‌ర్లు ఉన్నారు. ఇందులో ఒక‌రు 46 ఏళ్ల కంటి స‌ర్జ‌న్ డాక్టర్ బల్జిత్ కౌర్, మ‌రొక‌రు ఏళ్ల డెంటిస్ట్ డాక్టర్ విజయ్ సింగ్లా. ఈయ‌న వయ‌స్సు కూడా 46 సంవ‌త్స‌రాలు. 

ETO నుంచి రిటైర్మెంట్ తీసుకున్న హర్భజన్ సింగ్ కు కూడా మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కింది. ఆయ‌న జండియాలా నుండి ఎన్నికలలో గెలిచారు. ఆయ‌న కాంగ్రెస్ ముఖ్యనేత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుఖ్‌విందర్ సింగ్ డానీని 25,000 ఓట్లతో ఓడించాడు. ఈ మంత్రి వ‌ర్గంలో మొద‌టి సారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన 47 ఏళ్ల లాల్ చంద్ కటారు చక్ కూడా మంత్రిగా అవ‌కాశం ల‌భించింది. ఆయ‌న భోవా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

రెండో సారి బర్నాలా స్థానాన్ని నిలబెట్టుకున్న 32 ఏళ్ల గుర్మీత్ సింగ్ మీత్ హయర్ కూడా మంత్రి అయ్యారు. హ‌యర్ బీటెక్ చ‌దివారు. ఆయన గతసారి కాంగ్రెస్ అభ్యర్థి కేవల్ ధిల్లాన్‌పై విజయం సాధించగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ రైల్వే మంత్రి పవన్ బన్సాల్ కుమారుడు మనీష్‌పై గెలుపొందారు. 

గ‌తంలో యూఎస్ పౌరుడిగా ఉండి, ప్ర‌స్తుతం పంజాబ్ లో స్థిర‌ప‌డి అజ్నాలా నుండి ఆప్ ఎమ్మెల్యేగా గెలిచిన కుల్దీప్ సింగ్ ధాలివాల్ కూడా మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న వ్య‌వ‌సాయం చేయ‌డానికి ఇక్క‌డికి తిరిగి వ‌చ్చారు. మొద‌టి సారిగా ఎమ్మెల్యేగా గెలిచిన మ‌రో ఎమ్మెల్యే 41 ఏళ్ల లాల్‌జిత్ సింగ్ భుల్లర్ కు కూడా మంత్రి వ‌ర్గంలో చోటిచ్చారు. ఆయ‌న కమీషనింగ్ ఏజెంట్ గా ప‌ని చేసేవారు. లాల్‌జిత్ సింగ్ మాజీ మంత్రి, మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ అల్లుడు అయిన అకాలీదళ్‌కు చెందిన ఆదేశ్ పర్తాప్ సింగ్ కైరాన్‌పై గెలుపొందారు. 

నాలుగు సార్లు కౌన్సిల‌ర్ గా గెలిచి, ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన 56 ఏళ్ల పండిత్ బ్ర‌హ్మ్ శంక‌ర్ జింపా కూడా భ‌గ‌వంత్ మాన్ టీంలో చోటు ద‌క్కింది. ఆయ‌న గ‌తంలో హోషియాపూర్ నుంచి కౌన్సిలర్ గా ఉన్నారు. అయితే అతడి పూర్వీకులు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు చెందిన వారు. శంక‌ర్ జింపా పరిశ్రమల శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి సుందర్ శామ్ అరోరాపై ఆయన 13,859 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయ‌న సెకండ‌రీ స్కూల్ విద్య‌ను అభ్య‌సించారు. 

అతి చిన్న వ‌య‌స్సులో ఆనంద్‌పూర్ సాహిబ్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన హర్జోత్ సింగ్ బెయిన్స్ మాన్ కూడా మంత్రి వ‌ర్గంలో చేరారు. అతను పంజాబ్ యూనివ‌ర్సిటీ నుంచి BA LLB ఆనర్స్ డిగ్రీ పొందారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుండి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లాలో కోర్సు కూడా చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. బెయిన్స్ కు అన్నా హజారే ఉద్యమంతో కూడా సంబంధం ఉంది. అయ‌న 23 సంవత్సరాల వయస్సులో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు.