ఆప్ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనని తెలిపారు. అయితే భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్‌కలన్‌లో తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మ్యాజిక్ వర్కౌట్ అయింది. భారీ మెజారిటీతో ఆప్ ప్రభుత్వం పంజాబ్‌లో అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతుంది. దీంతో ఆప్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక, ఆప్ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనని తెలిపారు. భగవంత్ మాన్ ధురి నిజయోజకవర్గం నుంచి 58 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన నవాన్‌షహర్ జిల్లాలోని ఖట్కర్‌కలన్‌లో తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. అలాగే ప్రభుత్వం కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటో ఉండదని తెలిపారు. ‘ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్‌భవన్‌లో జరగదు.. ఖట్కర్‌కలన్‌లో జరగుతుంది. తేదీని తరువాత ప్రకటిస్తాము’ అని చెప్పారు. ఈ ప్రకటనపై ఆప్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
‘ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ ముఖ్యమంత్రి చిత్రపటం ఉండదు. దానికి బదులుగా భగత్ సింగ్, బీఆర్ అంబేద్కర్ చిత్రాలు ఉంటాయి’ అని భగవంత్ మాన్ చెప్పారు. పెద్ద పెద్ద నాయకులు కూడా ఓటమి పాలయ్యారని.. పలువురి పేర్లను ఆయన ప్రస్తావించారు. పాఠశాలలు, ఆరోగ్యం, పరిశ్రమలు, మహిళా భద్రత, క్రీడా మౌలిక సదుపాయలను మెరుగుపరచడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం వంటి అంశాలకు.. తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.
ఒక నెల రోజుల్లోనే పంజాబ్‌లో మార్పును చూడటం మొదలువుతుందని భగవంత్ మాన్ హామీ ఇచ్చారు. ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. ఆప్‌కు ఓటు వేయని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల కోసం పని చేస్తుందని తెలిపారు.
ఇక, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా సాగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ప్రస్తుతం.. 81 స్థానాల్లో గెలుపొంది. మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించి.. 4 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 2, శిరోమణి అకాలీదళ్ 3, బీఎస్పీ ఒక్క స్థానంలో, ఇతరులు ఒక చోట విజయం సాధించారు.
