పంజాబ్ ఎన్నికల వాయిదాపై నేడు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనివ్వనుంది. గురు రవిదాస్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ ను అభ్యర్థించాయి. ఈ విషయం చర్చించడానికి నేడు ఎన్నికల సంఘం సమావేశం కానుంది.

punjab assembly election 2022 : పంజాబ్ (punjab) ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌నున్నాయా ? లేక షెడ్యూల్ ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన జ‌రుగుతాయా ? ఈ విష‌యంపై నేడు క్లారిటీ రానుంది. వ‌చ్చే నెల‌లో గురు రవిదాస్ (guru ravidhas) జయంతి ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో పంజాబ్‌లో ఎన్నిక‌లు వాయిదా వేయాల‌ని రాష్ట్రంలోని వివిధ రాజ‌కీయ పార్టీలు, నేత‌లు ఎన్నిక‌ల సంఘానికి విన‌తులు అందించారు. ఈ విష‌యం చ‌ర్చించేందుకు సోమ‌వారం ఎన్నిక‌ల సంఘం స‌మావేశం కానుంది. త‌ర్వాత నిర్ణయం ప్ర‌క‌టించ‌నుంది. 

పంజాబ్‌లో అసెంబ్లీకి ఒకే దశలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 10వ తేదీని ఓట్ల లెక్కింపు చేప‌ట్టి అదే రోజు ఫ‌లితాలు వెళ్ల‌డిస్తారు. ఈ మేర‌కు జ‌న‌వ‌రి 8వ తేదీన కేంద్ర ఎన్నిక‌ల సంఘం 5 రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ లో భాగంగా పంజాబ్ రాష్ట్ర ఎన్నిక‌ల షెడ్యూల్ ను కూడా విడుద‌ల చేసింది. గురు రవిదాస్ జయంతి నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను ఆరు రోజుల పాటు వాయిదా వేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ ఎస్ చన్నీ(charanjith s channi) ఇటీవల పోల్ ప్యానెల్‌ (pole pannel)కు లేఖ రాశారు. గురు రవిదాస్ జయంతి ఫిబ్రవరి 16న జరుగుతుందని. రాష్ట్ర జనాభాలో దాదాపు 32 శాతం జనాభా ఉన్న షెడ్యూల్డ్ కులాలకు (schedul caste) చెందిన కొందరు ప్రతినిధులు తన దృష్టికి తీసుకొచ్చారని ఆయ‌న ఆ లేఖ‌లో పేర్కొన్నారు. ‘‘ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వ‌ర‌కు రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భక్తులు (సుమారు 20 లక్షల మంది) ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌ను సందర్శించే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో ఈ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోలేరని చెప్పారు. ఓటు హక్కు వినియోగించుకోవడం రాజ్యాంగం అందరికీ కల్పించిన హక్కు అని లేఖలో తెలిపారు. 

ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌ల‌కు ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 16 వరకు బనారస్‌ని సందర్శించడానికి, అలాగే అసెంబ్లీ ఎన్నికలలో కూడా పాల్గొనడానికి వీలుగా ఓటింగ్ తేదీని పొడిగించాలని సీఎం కోరారు. ఈ మేర‌కు త‌న‌కు ప్ర‌జ‌ల నుంచి అనేక అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కనీసం ఆరు రోజులు వాయిదా వేయ‌డం న్యాయ‌మైన‌ద‌ని, స‌ముచిత‌మైన‌ద‌ని పేర్కొన్నారు. దీని వ‌ల్ల రాష్ట్ర శాసనసభకు 20 ల‌క్ష‌ల మంది ఓటు వేసే హక్కును ఉప‌యోగించుకుంటార‌ని పేర్కొన్నారు. 

పంజాబ్ సీఎం చరణ్‌జిత్ ఎస్ చన్నీతో పాటు, బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూడా గురు రవిదాస్ జయంతి దృష్ట్యా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నిక‌ల సంఘాన్ని అభ్యర్థించాయి. అంతకు ముందు బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన పంజాబ్ చీఫ్ జస్వీర్ సింగ్ గర్హి కూడా ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 20 వరకు ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ అభ్య‌ర్థ‌న‌ల‌పై ఎన్నిక సంఘం నేడు స‌మావేశమై తుది నిర్ణ‌యం తీసుకోనుంది.