ఇసుక మాఫియాతో పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీకి భాగస్వామ్యం ఉందని మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఆరోపించారు. ఈ విషయంలో తన వద్ద నిర్ధిష్ట సమాచారం ఉందని తెలిపారు. తనకు ప్రమేయం లేదని చన్నీ మాటలు అబద్దాలని అని కొట్టిపారేశారు. 

పంజాబ్ (punjab) లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రతిపక్ష, అధికార పార్టీల మధ్య యుద్ధం జరగుతోంది. ఒక పార్టీ నాయ‌కులు, మ‌రో పార్టీ నాయ‌కుల‌పై ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుత సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ(cm charanjeeth singh channi) పై మాజీ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ (amarindar singh) తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో సీఎం ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారంటూ విమ‌ర్శించారు. 

అక్రమ ఇసుక తవ్వకాలలో తన ప్రమేయం లేద‌ని సీఎం చన్నీశ‌నివారం స్ప‌ష్టం చేశారు. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని వాటిని ఖండించారు. అయితే చ‌న్నీ వ్యాఖ్య‌ల‌న్నీ ‘‘అబ‌ద్దం’’ అని అమరీందర్ సింగ్ కొట్టిపారేశారు. సీఎంతో పాటుగా రాష్ట్రంలోని అనేక మంది కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలకు ఇసుక మాఫియాతో వాటాలు ఉన్నాయ‌ని అన్నారు. ఈ విష‌యంలో త‌మ‌కు నిర్ధిష్ట స‌మాచారం వ‌చ్చింద‌ని తెలిపారు. ‘‘ నేను (పంజాబ్) సీఎంగా ఉన్నప్పుడే సోనియా గాంధీ (sonia gandhi)కి ఈ విష‌యం తెలిపాను. ఇందులో పై స్తాయి నుంచి కింది స్థాయి వ‌ర‌కు, సీనియ‌ర్ మంత్రుల నుంచి చాలా మంది ప్ర‌మేయం ఉంద‌ని తెలిపాను. ఈ విష‌యంలో ఎలాంటి యాక్ష‌న్ తీసుకుంటావ‌ని సోనియా గాంధీ న‌న్ను అడిగారు. నేను పై నుంచి ప్రారంభించాల‌ని చెప్పాను. కానీ నా మొత్తం ప‌ద‌వీ కాలంలో నేను చేసిన ఒకే ఒక త‌ప్పు ఏంటంటే.. కాంగ్రెస్ ప‌ట్ల నాకు ఉన్న విదేయత వ‌ల్ల నేను వారిపై ఎలాంటి చ‌ర్య తీసుకోలేదు’’ అని అమరీంద్ సింగ్ చెప్పినట్టు మీడియా సంస్థ పేర్కొంది. 

రూప్‌నగర్ (rup nagar) జిల్లాలోని తన నియోజకవర్గం చమ్‌కౌర్ సాహిబ్‌ (chamkour sahib)లో పంజాబ్ సీఎం చన్నీ అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారని అకాలీదల్ సీనియర్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజిథియా (bikram singh majithiya)శనివారం ఆరోపించారు. దీనిపై సీబీఐ (cbi)విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే మజిథియా ఆరోపణపై పంజాబ్ ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. పంజాబ్ అంతటా ఇసుక తవ్వకాలలో తన ప్రమేయాన్ని సూచించే ఒక్క రుజువు అయినా చూపించాలని అతనికి సవాల్ విసిరారు. 

జనవరి 18వ తేదీన సీఎం మేనళ్లుడు భూపెందర్ సింగ్ హనీ (bhupendar singh honey) ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ (enforcement) దాడులు నిర్వహించిన వారం రోజుల తరవాత ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భూపెందర్ సింగ్ ఇంటితో పాటు పంజాబ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో అదే రోజు సోదాలు జరిగాయి. అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్న కంపెనీలపై మనీలాండరింగ్ (money landaring) విచారణలో భాగంగా ఈడీ దాడులు చేసిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండ‌గా.. 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేప‌ట్టి అదే రోజు ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో అధికారంలో ఉంది. ఈ సారి ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ (aam admi party), బీజేపీ (bharatiya janatha party - bjp) ప్రయత్నిస్తున్నాయి.