వేరే కులం అమ్మాయిని ప్రేమించిన పాపానికి ఓ యువకుడిని దారుణమైన శిక్ష విధించారు. బ‌ల‌వంతంగా మూత్రం తాగిస్తూ నీచానికి దిగారు. ఈ అమానుష ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లో జూన్ 11న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సిరోహి జిల్లాకు చెందిన క‌లురామ్ దేవ‌సి అనే యువ‌కుడు ఓ అమ్మాయిపై మ‌న‌సు పారేసుకున్నాడు. అత‌డి ప్రేమ విష‌యం తెలిసిన కుల‌పెద్ద‌లు క‌లురామ్‌పై దాడికి దిగారు. జుట్టు ప‌ట్టుకుని అతి దారుణంగా కొట్టారు.

మైన‌ర్ బాలుడు స‌హా ఐదుగురు వ్య‌క్తులు అత‌డిని చిత‌క‌బాదుతూ, చెప్పుతో దండిస్తూ హింసించారు. మూత్రం నింపిన బాటిల్‌ను ఇచ్చి బ‌ల‌వంతంగా తాగించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. 

మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై బాధితుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. వీరితోపాటు ఓ మైన‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. సదరు యువకుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం సరిగా లేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.