డ్రైడే రోజు ఓ మహిళా టెక్కీకి మద్యం తాగాలని అనిపించింది. తనతోపాటు తన స్నేహితులతో పార్టీ చేసుకోవాలని ఆశపడింది. వీకెండ్ కదా ఎంజాయ్ చేయాలని భావించింది. కానీ ఆ రోజు అయోధ్య తీర్పు ఇస్తున్న రోజు కావడంతో డ్రైడేగా ప్రకటించారు. దీంతో ఆమె ఆన్ లైన్ లో మందు ఆర్డర్ చేయాలని అనుకుంది. 

ఆన్ లైన్ లో సెర్చ్ చేయగా.. మందు సరఫరా చేసే ఓ వ్యక్తి సమాచారం దొరికింది. దీంతో ఆమె వెంటనే అతనిని సంప్రదించింది. తీరా అతను ఆమె అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని దాదాపు రూ.50వేలు కాజేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పూణేకి చెందిన మహిళ ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కాగా.. ఆమె శనివారం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవాలని అనుకుంది. ఆ రోజు డ్రైడే కావడంతో.. దుకాణాలన్నీ మూసేసి ఉన్నాయి. దీంతో ఆమె ఆన్ లైన్ లో వెతికింది. ఓ వ్యక్తికి ఫోన్ చేయగా... అతను మందు ఇంటికి పంపించాలంటే బ్యాంక్ వివరాలు చెప్పాల్సిందిగా కోరాడు.

దీంతో ఆమె అలానే చేసింది. ముందు ఆమె దగ్గర నుంచి ఓటీపీ నెంబర్ తీసుకొని రూ. 31,777 డ్రా చేసుకున్నాడు. ఎక్కువ ఎమౌంట్ కట్ అయ్యాయి అని ఆమె అతనికి ఫిర్యాదు చేయగా.. మళ్లీ మీ ఎకౌంట్ లో క్రెడిట్ అవుతాయని నమ్మించాడు. మరోసారి ఓటీపీ నెంబర్ చెప్పమని రూ.19,001 తీసుకున్నాడు. అనంతరం అతని ఫోన్ ఆఫ్ చేశాడు.

అతని ఫోన్ ఎంతసేపటికి కలవకపోవడంతో తాను మోసపోయానన్న విషయం ఆమె గుర్తించింది. దీంతో.. వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఆమె రూ.50,778 పోగొట్టుకుంది. కాగా.. ఆమె వద్ద డబ్బులు కాజేసిన వ్యక్తిని ట్రేస్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.