మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా పుణే జిల్లాలో జరిగిన వివిధ ఘటనల్లో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పుణే నగరంలోని శహకర్‌ నగర్‌లో గోడ కూలిపోవడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు సమాచారం.

పుణేతో పాటు జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. పురాతన గృహాలు, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివసించోద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు స్కూళ్లు, కాలేజీలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు.

మరోవైపు వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఏడుగురు మరణించినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

బారామతి ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న 15,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పుణే జిల్లాకు పంపారు. గురువారం వర్షం కాస్త తెరిపినివ్వడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.