ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల సందడి ఓ వైపు ఉంటే.. మరోవైపు బెట్టింగ్‌ల జోరు కొనసాగుతుంది. తాజాగా పూణెలో ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల సందడి ఓ వైపు ఉంటే.. మరోవైపు బెట్టింగ్‌ల జోరు కొనసాగుతుంది. తాజాగా పూణెలో ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. పూణెలో ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌కు పాల్పడుతున్న బుకీలపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిన్న రాత్రి దాడులు నిర్వహించారు. కోంధ్వాలోని బ్రహ్మ అంగన్ సొసైటీకి చెందిన బి వింగ్‌లోని ఒక ఫ్లాట్‌లో జరిపిన దాడుల్లో.. తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఒక కంప్యూటర్, మూడు ల్యాప్‌టాప్‌లు, 18 మొబైల్ హ్యాండ్‌సెట్‌లు, 92 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

 పోలీసు అదనపు కమిషనర్ రామ్‌నాథ్ పోక్లే, డీసీపీ అమోల్ జెండే మార్గదర్శకత్వంలో ఏసీపీ సునీల్ పవార్, యూనిట్-3 సీనియర్ ఇన్‌స్పెక్టర్ శ్రీహరి బహిరత్ ఈ ఆపరేషన్‌ చేపట్టారు. బెట్టింగ్‌కు పాల్పడుతూ అరెస్ట్ అయిన వ్యక్తులను.. హేమంత్ రవీంద్ర గాంధీ, అజింక్య శ్యాంరావు కొలేకర్, సచిన్ సతీష్ ఘోడ్కే, యశ్ ప్రతాప్ మనోజ్‌కుమార్ సింగ్, ధర్మేంద్ర సంగమ్‌లాల్ యాదవ్, రింగల్మ్ చంద్రశేఖర్ పటేల్, అనురాగ్ ఫుల్‌చంద్ యాదవ్, ఇంద్రజిత్ గోపాల్ ముజుందార్, సతీష్ సంతోష్‌లుగా గుర్తించారు.

అయితే పక్కా సమాచారంతోనే పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా గ్యాంబ్లింగ్ డెన్ నిర్వహిస్తున్నట్లు క్రైం బ్రాంచ్‌కు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఇక, నిందితులపై బాంబే ప్రివెన్షన్ ఆఫ్ గ్యాంబ్లింగ్ యాక్ట్‌లోని సంబంధిత నిబంధనల కింద కోంద్వా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.